ప్రపంచ రాజకీయాల్లో చెదరని సంతకం

ప్రపంచ రాజకీయాలపై గాంధీజీది చెదరని సంతకం. బాణం వేయలేదు.గన్ను పేల్చలేదు. కొట్లాటలు వద్దు. కేవలం ధర్నాలే చాలని అన్నారు. శాంతినే బాణంగా ప్రయోగించారు. మమూలోడు తలచుకుంటే మహారాజునైనా తరిమివేయవచ్చునని నిరూపించాడు. ఒకటా, రెండా ఇట్లాంటివి ఎన్నో చేసి చూపించారు. అందుకే అన్ని దేశాల్లో గాంధీ మోడల్ కు ఆదరణ పెరిగింది. ఎంతోమంది లీడర్లు ఈ మోడల్ ను ఫాలో అయ్యారు. గెలుపూ సాధించారు. ఆరోజే కాదు ఈ రోజు కూడా గాంధీ మోడల్ తిరుగులేనిది. ప్రాక్టికల్ గా మారింది. గాంధీ దారిలో నడిచి లీడర్లుగా ఎదిగిన చాలా మంది నోబెల్​ శాంతి బహుమతి సాధించడం విశేషం.

అసలు ఏంటి ఈ గాంధీయిజం? ఈ ప్రశ్న పెద్ద చర్చకు టాపిక్ అవుతోంది. సత్యాగ్రహం, అహింస, సహాయ నిరాకరణ, చట్టాల ఉల్లంఘన….ఈ నాలుగింటినే గాంధీయిజంగా చెప్పుకుంటాం. గాంధీయిజం అంటే ఇవే కాదు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.అహింస  ను గాంధీ కొత్తగా కనిపెట్టలేదు. భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనా విధానంలోనే అహింస ఇమిడిపోయి ఉంది. అహింసను ఆచరించాలంటే మాటలు కాదు.దానిపై ఎంతో నమ్మకం ఉండాలి. గుండెనిండా  ధైర్యం ఉండాలి. ఈ రెండూ ఉన్న నాయకుడు గాంధీజీ. ఒక రకంగా దమ్మున్న లీడర్.

నోబెల్ శాంతి బహుమతి అంటే మాటలు కాదు. ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేసిన వారికి ఈ బహుమతి ఇస్తారు. గాంధీ సిద్దాంతాలను ఫాలో అయిన నాయకులందరికీ నోబెల్ బహుమతి రావడం విశేషం. గాంధీజీ సిద్దాంతాలకు ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న ఆదరణకు దీనిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మార్టిన్ లూధర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆంగ్ సాన్ సూకీ, బారక్ ఒబామా, లెక్ వాలేసా….వీరందరిపై  గాంధీ ప్రభావం ఉంది. గాంధీ చూపించిన దారిలోనే వీళ్లు ప్రయాణించారు. పోరాటాలు చేశారు. తాము అనుకున్నది సాధించారు.

గాంధీ చూపించిన దారిలో  ఎందరో నడిచారు.మార్టిన్ లూధర్ కింగ్ తన పోరాటానికి గాంధీయిజాన్నే  స్ఫూర్తిగా తీసుకున్నారు. అమెరికాలో  నివసిస్తున్న ఆఫ్రికన్ల హక్కుల కోసం గాంధీ చూపిన బాటలోనే పోరాటం చేశారు. అనుకున్నది సాధించారు. 1964 లో నోబెల్ శాంతి బహుమతి తీసుకునేటప్పుడు మార్టిన్ లూధర్ కింగ్ ఇదే విషయం చెప్పారు. “ ప్రపంచంలో అహింస అంతటి పదునైన ఆయుధం మరోటి లేదు. చుక్క రక్తం చిందించకుండా నియంతలతో కూడా  పోరాటం చేయగల ఆత్మస్థైర్యాన్ని  ఈ ఆయుధం ఇస్తుంది ” అన్నారు.

నల్లజాతి సూరీడు కూడా…...

నల్లజాతి సూరీడుగా పేరొందిన నెల్సన్ మండేలా కూడా గాంధీజీ సిద్దాంతాలతో  ప్రభావితుడైన నాయకుడే. నల్లజాతి వాళ్లంటే అసహ్యించుకునే రోజుల్లో ఆఫ్రికాలో ఉదయించిన సూరీడు మండేలా. తన జాతి  ప్రజల హక్కుల కోసం ఆయన రాజీలేని పోరాటం చేశాడు. ప్రభుత్వం పై తిరుగుబాటు చేశాడు. పాతికేళ్లకు పైగా జైల్లో గడిపాడు. జైలు నుంచి విడుదలైన తరువాత దక్షిణాఫ్రికా ఎన్నికల్లో పోటీ చేసి తొలి బ్లాక్ ప్రెసిడెంట్ అయ్యారు. హింసా మార్గంలో  మొదలైన ఉద్యమాన్ని గాంధేయమార్గంలోకి మండేలా మలచుకున్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. అందుకే ఆయన ‘దక్షిణాఫ్రికా గాంధీ’ గా పేరు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే దక్షిణాఫ్రికాలో  సమానత్వం కోసం గాంధీ మొదలెట్టిన ఉద్యమాన్ని  నెల్సన్ మండేలా క్లైమాక్స్ కు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు.

కాలపరీక్షకు తట్టుకునేది నిజం మాత్రమే

ఎన్ని కాలపరీక్షలకైనా తట్టుకునే శక్తి ఒక్క నిజానికే ఉందనేవారు గాంధీజీ. నిజమనే ఆయుధంతోనే ఆయన పోరాటం చేశారు. మన ఉపనిషత్తులలోని ‘సత్యమేవ జయతే’ సూక్తి నుంచి గాంధీ ప్రేరణ పొందారు. ‘ మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్ ’ పేరుతో తన ఆటోబయోగ్రఫీ రాశారు. అంటే నిజమనే అంశానికి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థమవుతుంది.  ఈ పుస్తకం  ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాదు ప్రపంచ భాషలన్నిటిలోనూ ట్రాన్స్ లేట్ అయింది. దీనినిబట్టి గాంధీజీ సిద్ధాంతాలు, ఆలోచనలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు.

పోలెండ్ లోనూ గాంధీయిజం…..

పోలెండ్ లో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన లెక్  వాలేసాపై కూడా గాంధీ ప్రభావం ఉంది. గాంధీయిజాన్నే నమ్ముకుని కార్మికుల హక్కుల కోసంపోరాటం చేశాడు. వాలేసాకు

1983 లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతెందుకు హాంగ్​కాంగ్​లో కూడా ప్రస్తుత ఉద్యమం తొలిదశ గాంధీ చూపిన మార్గంలోనే సాగింది.

మహాత్ముడిచ్చిన మనోధైర్యం

మయన్మార్ లో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన ఆంగ్ సాన్ సూకీ కూడా గాంధీ సిద్ధాంతాలతో  స్ఫూర్తి పొందినామెనే. 15 ఏళ్లకు పైగా మయన్మార్ ప్రభుత్వం ఆమెను  హౌస్ అరెస్ట్ లో ఉంచింది. ఇంత కాలం ఇంటి జైల్లో ఉన్నప్పటికీ సూకీ ఏనాడూ మనో ధైర్యాన్ని కోల్పోలేదు. అప్పటి మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అహింసా మార్గంలో పోరాటం చేసింది. ఈ పోరాటంలోనే ఆమె రాజకీయ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ’ (ఎన్ ఎల్ డీ ) ఎన్నికల్లో పొందింది. 1991 లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది కూడా. ఆ బహుమతి అందుకున్న రోజున ఆంగ్ సాన్ సూకీని ‘ గాంధీజీ అహింసా విధానాలకు వారసురాలు’  అని ‘టైమ్’ మేగజైన్ పేర్కొంది. వీరే కాదు ప్రపంచపటం పై  మహా నాయకులుగా పేరొందిన వారిపైనా గాంధీజీ  ప్రభావం ఉంది.

గాంధీనే నాకు ఇన్ స్పిరేషన్

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బారక్ ఒబామా పై కూడా గాంధీ సిద్ధాంతాల ప్రభావం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి నల్లజాతి వాడిగా చరిత్ర సృష్టించుకున్నాడు ఒబామా.  నోబెల్​ శాంతి బహుమతి తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “గాంధీజీ బోధనలే నాకు ఇన్ స్పిరేషన్. ఆయన లేకపోతే నేను అమెరికా ప్రెసిడెంట్ ను అయ్యేవాడిని కాదు ” అన్నారు. ఇండియా టూర్ లోనూ ఆయన ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పారు.

ముందు తానే ఆచరించి

గాంధీజీ ఎప్పుడూ తాను ఆచరించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. కోర్టులో ప్రాక్టీసు చేయాలంటే లాయర్ల డ్రెస్​ కోడ్​ తప్పనిసరిగా పాటించాలి.  బ్రోకరేజీ సిస్టమ్​కి వ్యతిరేకి కావడంతో అసలే కేసులు అంతంత మాత్రంగా ఉండేవి. కేవలం పిటిషన్లు రాసి పెట్టే పనే ఎక్కువగా ఉండేది. అయినాగానీ, రోజూ నీటుగా కోటు, బూటు వేసుకుని, మెడలో లాయర్ల కాలర్​ కట్టుకోవలసి వచ్చేది. లాండ్రీ బిల్లు చాలా ఎక్కువ. లాండ్రీ వ్యక్తి త్వరగా బట్టలు తెచ్చేవాడు కాదు. ఈ బాధలు పడలేక బట్టలు ఎలా ఉతుక్కోవాలో ఒక పుస్తకాన్ని చదివి నేర్చుకున్నారు. బట్టలుతకడానికి కావలసిన సామగ్రి తెచ్చుకున్నారు. కాలర్​కి గంజి ఎక్కువ కావడంతో అది కాస్తా మెడకు బిగుసుకునేది. అయితే, కొద్ది రోజుల్లోనే బట్టలుతుక్కోవడంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు.  ఒకసారి గోపాలకృష్ణ గోఖలే పార్టీ సమావేశాలకు వచ్చి గాంధీజీతో ఉండాల్సి వచ్చింది. ఆయన స్కార్ఫ్​ బాగా నలిగిపోయి ఉంది. గాంధీ ఇస్త్రీ చేయడానికి తీసుకుంటే ‘నువ్వు లాయర్​వని తెలుసు. దీనిని పాడు చేస్తావేమో’ అని సందేహించారు. కానీ, గాంధీ నీటుగా ఇస్త్రీ చేయడంతో గోఖలే శభాష్​ అని మెచ్చుకున్నారు.

లండన్​ వెళ్లినా పంచెతోనే..

లండన్​లో జరిగిన రెండో​ రౌండ్​ టేబుల్​ కాన్ఫరెన్స్ (1931)​లో పాల్గొనడానికి తన సాధారణ పంచె కండువాలతోనే గాంధీజీ వెళ్లారు. ఆ సమయానికి లండన్​లో చలి గజగజ వణికిస్తుంటే… ఆయనతో వెళ్లినవాళ్లందరూ స్వెట్టర్లు వగైరాలను కప్పుకోవలసి వచ్చింది.

గాంధీని రానివ్వని అర్చకులు

గాంధీజీ మానవతావాది. ఆలయ ప్రవేశంలేని వర్గాలకోసం పోరాడిన వ్యక్తి. అందరికీ సమాన హక్కులుండాలని వాదించిన నాయకుడు. అలాంటిది ఒకసారి కన్యాకుమారికి వెళ్తే అక్కడి భగవతి అమ్మన్​ ఆలయంలోనికి అర్చకులు రానివ్వలేదు. ఈ ఘటన దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చేసిన పదేళ్లకు జరిగింది. 1925లో ట్రావెన్కూర్​ (కేరళ) పర్యటనకు వెళ్లినప్పుడు జరిగింది. గాంధీజీ ఇంగ్లాండ్​లో బారిస్టర్​ చదవడానికి సముద్రయానం చేశాడన్న కారణంతో ఆయనను అర్చకులు గుడి లోపలికి రానివ్వలేదు. బయటనుంచే గాంధీజీ దణ్ణం పెట్టుకుని వచ్చేశారు. ఇదంతా నవజీవన్​ వీక్లీ (1925 మార్చి 29నాటి సంచిక)లో ‘దర్శన్​ ఆఫ్​ కన్యాకుమారి’ అనే ఆర్టికల్​లో రాసుకొచ్చారు.  ‘ఇదేం ఆచారం? నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాను. తీరా గుడిలోకి వెళ్దామనుకుంటే అడ్డుకున్నారు. అమ్మవారు మైలపడుతుందా? లేక కన్యాకుమారి కలుషితమవుతుందా? ప్రాచీన కాలంలో ఇలాంటి ఆచారమేదైనా ఉందా?’ అని గాంధీజీ చాలా ఆవేదనతో ఆర్టికల్​ రాశారు. ఇది చదివాక ట్రావెన్కూర్​ రాజా శ్రీ చిత్తిర తిరునాళ్​ బలరామ వర్మ స్పందించారు. సముద్ర ప్రయాణం చేసినవారిని అడ్డుకోరాదని శాసనం చేశారు.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లిన కొత్తలో ఒక హెయిర్​ కటింగ్​ సెలూన్​కి వెళ్లారు. అక్కడి పనివాళ్లు గాంధీజీ నాన్​–వైట్​ కాబట్టి, ఆయనకు కటింగ్​ చేయడానికి ఇష్టపడలేదు. దాంతో ఆయన మార్కెట్​కి వెళ్లి ఒక దువ్వెన, క్లిప్పర్లు కొనుక్కొచ్చారు.  వాటితోనే కష్టపడి తన జుట్టు తానే కటింగ్​ చేసుకున్నారు. అలవాటు లేని పని కావడంతో అడ్డదిడ్డంగా క్రాఫ్ తయారైంది. మర్నాడు కోర్టుకి వెళ్తే సాటి లాయర్లంతా ఘొల్లున నవ్వారు. ‘ఏం గాంధీ, నీ నెత్తిని రాత్రి ఎలుక కొరికేసిందా?’ అని ఎగతాళి చేశారు. అయినా, గాంధీజీ సిగ్గుపడలేదు. ‘నా జుట్టును నేనే ట్రిమ్​ చేసుకునే అవకాశం దక్కించుకున్నాను’ అన్నారు.

ఎదురుతిరిగింది చంపారన్​లో..

గాంధీజీ అంటే మనందరికీ గుర్తొచ్చేది స్వతంత్ర్య పోరాటం, ఆయన చేసిన సత్యాగ్రహాలు. చట్టాలను పాటించకపోవడం (సివిల్‌‌ డిసొబీడియన్స్‌‌ మూమెంట్‌‌) మొదట ప్రారంభమైంది బీహార్‌‌‌‌లోని చంపారన్‌‌ గ్రామంలో. ఒకప్పుడు ఎవరికీ తెలియని చంపారన్‌‌ గాంధీ ఉద్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాదు గాంధీజీ ఇండియాకు పరిచయం అయింది కూడా ఇక్కడి నుంచే. నీలిమందు రైతుల కష్టాలను గుర్తించిన గాంధీ 1917లో చంపారన్‌‌ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. మన దేశంలో చట్టాలను ధిక్కరించడం అనే మొదటి సంఘటన ఇదే అని చెప్తారు. సత్యాగ్రహంతోనే గాంధీజీకి చంపారన్‌‌తో అనుబంధం తెగిపోలేదని, ఆయన చాలా స్కూళ్లు, ఆశ్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి సింగ్‌‌ చెప్పారు. బీహార్‌‌‌‌లో భారీ భూకంపం వచ్చినప్పుడు గాంధీ సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. చంపారన్‌‌తో గాంధీజీకి ఉన్న అనుబంధానికి గుర్తుగా ఈస్ట్‌‌ చంపారన్‌‌ మోతీహరిలో ‘గాంధీ సంగ్రహాలయ మెమోరియల్‌‌ అండ్‌‌ మ్యూజియం’ ఏర్పాటు చేశారు. “గాంధీ చంపారన్‌‌ను మార్చారు. ఆయనకు గొప్పతనాన్ని తెచ్చి పెట్టిన ప్రదేశంగా చెప్పొచ్చు” అని మ్యూజియం సెక్రటరీ బ్రజ్‌‌కిశోర్‌‌‌‌ సింగ్‌‌ చెప్పారు.  మోతీమరిలో మహాత్ముడి పేరుతో చాలా ప్రదేశాలు ఉన్నాయి. గత ఏడాది ప్రధాని మోడీ బాపుధామ్‌‌ రైల్వేస్టేషన్‌‌ను కూడా ప్రారంభించారు.