ఏం న్యూ ఇయర్ సెలబ్రేషన్సో.. ఏందో.. హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే 2864 వాహనాలు సీజ్ !

ఏం న్యూ ఇయర్ సెలబ్రేషన్సో.. ఏందో.. హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే 2864 వాహనాలు సీజ్ !

హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీస్ స్ట్రిక్ యాక్షన్ తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్స్లో 2864 వాహనాలను పోలీసులు డిసెంబర్ 31, 2024 రాత్రి నుంచి జనవరి 1, 2025 వేకువజాము వరకూ చేసిన తనిఖీల్లో సీజ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో 1406 వెహికల్స్, సైబరాబాద్ పరిధిలో 839 వెహికిల్స్, రాచకొండ పరిధిలో 619 వెహికిల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ తనిఖీల్లో భాగంగా సీజ్ చేసిన వాహనాలను ఆయా పీఎస్ల పరిధిలో పోలీసులు ఉంచారు.

డ్రంక్ అండ్ డ్రైవ్లో బుక్ అయిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ తర్వాత ఆయా పీఎస్ల పరిధిలో కోర్టులకు హాజరవ్వాలని పోలీసులు స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆల్కహాల్ రీడింగ్ బట్టి 10 వేలకు పైనే ఫైన్ అమౌంట్, రెండవ సారి పట్టుబడితే  జైలు శిక్ష విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయిన వాహనాలను కుటుంబ సభ్యుల అండర్ టేకింగ్తో వాహనాలు ట్రాఫిక్ పోలీసులు తిరిగి ఇచ్చేశారు. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి డాక్యుమెంట్స్ తీసుకొని పోలీసులు వాహనాలు ఇచ్చేశారు. ఒరిజినల్స్ ఇవ్వని వారి వాహనాలను మాత్రమే ఆయా పీఎస్లో పోలీసులు ఉంచారు.

నార్సింగి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డిసెంబర్ 31, 2024న రాత్రి చేపట్టిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 62 మంది మందుబాబులు పట్టుబడ్డారు. కోకాపేట్‌ ఫిషర్‌ లాండ్‌ హోటల్, నార్సింగి లోని వైఎస్‌ఆర్‌ చౌరస్తా, కాళీమందిర్‌ పీరంచెరువు చౌరస్తా, ఖానాపూర్‌ వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను చేపట్టారు. ఇప్పటికే ప్రజలకు మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికి ప్రజలు వాటిని వినిపించుకోకుండా రోడ్లపైకి వచ్చి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. మొత్తం 62 కేసులు నమోదు చేసినట్లు నార్సింగి ట్రాఫిక్ CI నిరంజన్ రెడ్డి తెలిపారు.

నూతన సంవత్సర వేళ కొంతమంది దేవాలయాలకు క్యూ కడితే, మందు బాబులు మాత్రం కౌన్సిలింగ్ సెంటర్ వద్ద బారులు తీరారు. న్యూ ఇయర్ జోష్లో డిసెంబర్ 31 నైట్ మోతాదుకు మించి మద్యం సేవించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు మత్తు వదిలిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులు, గోశామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద బుధవారం ఉదయం 9 గంటల నుంచి క్యూ లైన్ లు కట్టారు. స్టూడెంట్స్ అయితే వారి తల్లిదండ్రులను, పెళ్ళైన వాళ్ళు వారి భార్యలను కౌన్సిలింగ్కు తీసుకువచ్చారు.

పట్టుబడిన మందుబాబులకు వారి కుటుంబసభ్యులతో కలిసి 15 నిమిషాల నిడివి కలిగిన వీడియోను ప్రదర్శించారు. మద్యం తాగి వాహనం నడిపితే జరిగే ప్రమాదాలను ఈ వీడియోలో ట్రాఫిక్ పోలీసులు వివరించారు. జనవరి 1, 2024 (బుధవారం) ఒక్కరోజు 401 మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ పూర్తయినట్లు స్టాంప్ వేసి, పంపించారు.