
- నదీ పాయల మధ్యలో శివలింగం సెట్టింగ్
- పెద్ద ఎత్తున వెలసిన దుకాణాలు
- వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు
మెదక్, పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలకు జాతర కళ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి జాతర నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా శివరాత్రి రోజు చాలా మంది ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం శివుడికి పూజలు చేసి దీక్ష విరమిస్తారు. ఈ నేపథ్యంలో వనదుర్గా మాత ఆలయం ముందున్న మంజీరా నదీ పాయల మధ్యలో పరమశివుడు, శివలింగంతో భారీ సెట్టింగ్ఏర్పాటు చేశారు.
వివిధ దేవతా మూర్తులతోపాటు నందులు, గోవులు, ఏనుగులు, త్రిశూలాలతో మండపాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శివలింగంపై నిరంతరాయంగా నీరు పడే ఏర్పాటు చేశారు. దుర్గామాత ఆలయం కొలువై ఉన్నగుట్టపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను సున్నం, జాజు నామాలతో అలంకరించారు. ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న రాజగోపురాన్ని అలంకరించారు. మెదక్, హైదరాబాద్నేషనల్ హైవే నుంచి, నాగ్సానిపల్లి వైపు నుంచి ఏడుపాయల ప్రాంగణానికి చేరుకునే దారుల్లో ఆకర్షణీయమైన కమాన్లు ఏర్పాటు చేశారు.
జాతర దారుల్లో, కూడళ్లలో లైట్లు అమర్చారు. వనదుర్గామాత కొలువై ఉన్న రాతి గుహ ముందు రంగు రంగుల లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి వేల ఏడుపాయల ప్రాంగణం వెలుగులు విరజిమ్ముతోంది. జాతర సందర్భంగా ఏడుపాయల్లో వివిధ వస్తు సామగ్రి అమ్మే దుకాణాలు, హోటళ్లు, కూల్ డ్రింక్ షాప్‌లు, రంగుల రాట్నాలు, సర్కస్‌లు, సినిమా హాళ్లు వెలిశాయి.
పూల శోభితం
జాతర సందర్భంగా వనదుర్గా భవానీ మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగు రంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించారు. రాజగోపురం నుంచి ఆలయానికి వెళ్లే దారిలో ఇరువైపులా దేవతా మూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఏడుపాయల జాతర ప్రధానంగా మూడు రోజులు జరుగుతుంది. శుక్రవారం మహాశివరాత్రి, శనివారం జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు, మూడో రోజు ఆదివారం రథోత్సవం ఉంటాయి. శుక్రవారం తెల్లవారు జామునే పూజారులు అమ్మవారికి అభిషేకం నిర్వహించి, అలంకరణ చేసి, అర్చన చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
ఏడుపాయల్లో మహా శివరాత్రి జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. మూడు రోజుల పాటు జరిగే జాతరకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కలెక్టర్ నేతృత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన సదుపాయాలు కల్పించాం. తాగునీటి వసతి, టాయిలెట్లు, బస్సులు, హెల్త్‌క్యాంప్‌లు, గజ ఈతగళ్లు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
- బాలాగౌడ్, ఏడుపాయల దేవాలయ చైర్మన్