- ఊళ్లకు దగ్గర్లో ఉన్న గుట్టలపై ఇష్టారాజ్యంగా మైనింగ్
- రూల్స్ పట్టించుకోకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్న వ్యాపారులు
- బీటలు వారుతున్న ఇండ్లు, కూలుతున్న బోరు బావులు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న ప్రజలు
హనుమకొండ, వెలుగు : ఆఫీసర్లు యథేచ్ఛగా పర్మిషన్లు ఇవ్వడం, వ్యాపారులు ఇష్టారాజ్యంగా బాంబులు పెట్టి పేలుస్తుండడంతో ఓ వైపు గుట్టలు కరిగిపోతుండగా, మరో వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊళ్లకు దగ్గరగా ఉన్న గుట్టలతో పాటు, చారిత్రక ఆనవాళ్లు, గుడులు ఉన్న గుట్టలను సైతం మైనింగ్ చేసేందుకు ఆఫీసర్లు పర్మిషన్లు ఇస్తున్నారు. ఈ పర్మిషన్‌ను అడ్డుపెట్టుకొని వ్యాపారులు రూల్స్ పాటించకుండా బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. దీంతో రాళ్లు పడి ఇండ్లతో పాటు బోర్లు, బావులు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టారీతిన పర్మిషన్లు
హనుమకొండ జిల్లాలోని 14 మండలాల్లో 122 క్వారీలకు ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారు. ఇందులో గ్రానైట్ తవ్వకాలు, స్టోన్ క్రషర్ల పర్మిషన్ విషయంలో రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి మైనింగ్ చేపట్టే గుట్టలపై ఉన్న ఆలయాలు, కోనేరులు, చారిత్రక ఆనవాళ్లను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు స్థానికుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రెవెన్యూ ఆఫీసర్లు ఇదేమీ పట్టించుకోకుండానే ఎన్‌వోసీలు ఇస్తుండగా, మైనింగ్ ఆఫీసర్లు కూడా ఈజీగా పర్మిషన్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హసన్‌పర్తి మండలం మునిపల్లిలోని ఓ గుట్టపై శివుని గుడి, స్నానాల గుండం ఉండగా, స్థానికులు అక్కడ పూజలు చేసేవారు. కానీ అక్కడ మైనింగ్‌కు పర్మిషన్ ఇవ్వడంతో స్నానాల గుండం కనుమరుగవడమే కాకుండా ఆలయం కూడా దెబ్బతింటోంది. ఇక ధర్మసాగర్ మండలంలో జైనుల గుహలు, వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడి శిల్పాలు ఉన్న బోడగుట్టను కూడా ఆఫీసర్లు మైనింగ్ వ్యాపారుల చేతుల్లో పెట్టారు.
బ్లాస్టింగ్స్‌తో ఇండ్లకు బీటలు
గ్రామాలకు సమీపంలోని గుట్టలపై బ్లాస్టింగ్స్ చేయొద్దని చెబుతున్నా వ్యాపారులు అదేమీ పట్టించుకోవడం లేదు. హసన్‌పర్తి మండలం మునిపల్లి, ధర్మసాగర్ మండలం నారాయణగిరి గుట్టల్లో బ్లాస్టింగ్స్ చేస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున చేస్తున్న బ్లాస్టింగ్స్ కారణంగా సమీప గ్రామాల్లోని ఇండ్లు బీటలు వారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట మునిపల్లి శివారులోని ఓ క్వారీలో భారీ బ్లాస్టింగ్ చేయగా ఊరంతా దద్దరిల్లినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. రాళ్లు ఎగిరి వచ్చి గాయపడ్డ సంఘటనలు కూడా జరిగాయని చెప్పారు. శాయంపేట మండలం పెదకొడేపాక, ఆత్మకూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
బ్లాస్టింగ్స్ కారణంగా చుట్టుపక్కల ఉండే వ్యవసాయ బావులు, బోర్లు కూలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. ఎవరైనా ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే నయానో, భయానో ఒప్పించడం, లేదంటే తమకున్న పొలిటికల్ అండతో బెదిరింపులకు దిగుతున్నారు. కాగా మైనింగ్, బ్లాస్టింగ్‌కు పర్మిషన్ ఇవ్వొద్దంటూ ప్రజలు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. శాయంపేట మండలంలో క్వారీ లీజుపై ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా పర్మిషన్ ఇవ్వొద్దని రైతులు కోరారు.
ఇండ్లు దెబ్బతిన్నయ్
బ్లాస్టింగ్స్ వల్ల మా గ్రామంలో చాలా ఇండ్లు దెబ్బతిన్నయ్. అయినా బ్లాస్టింగ్ ఆపడం లేదు. బాంబుల మోతకు పిల్లలు కూడా భయపడుతున్నారు. బ్లాస్టింగ్స్ గురించి గతంలో ప్రశ్నిస్తే మా మీదే కేసులు పెట్టారు. గ్రామాలకు సమీపంలో బ్లాస్టింగ్స్ చేయకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.
- నద్దునూరి కరుణాకర్, మునిపల్లి
బావులు కూలుతున్నయ్
బ్లాస్టింగ్స్ తీవ్రత కారణంగా బోరు బావులు కూలుతున్నాయి. పొలాల్లో రాళ్లు పడి సాగుకి ఇబ్బంది ఎదురవుతోంది. పేలుళ్లు జరగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.
- అమరగొండ రవి, నారాయణగిరి