హైదరాబాద్, వెలుగు: వినియోగదారులపై అధిక చార్జీల భారం పడకుండా, విద్యుత్ సంస్థలు ఆర్థికంగా నష్టపోకుండా నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని విద్యుత్ నియంత్రణ భవన్ లో విద్యుత్ సంస్థల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిస్కమ్‌లు, జెన్కో, ట్రాన్స్ కో, సెస్ సంస్థలు ఇచ్చిన పలు ప్రతిపాదనలపై సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు మాట్లాడుతూ.. టారీఫ్ ప్రతిపాదనలను ఆలస్యంగా ఫైల్ చేసినందుకు విద్యుత్ సంస్థలకు జరిమానా విధించామని తెలిపారు. సుమోటోగా కేసులను స్వీకరించేందుకు అవసరమైన సమాచారం తమ వద్ద లేనందున.. ఆ నిర్ణయాలను సత్వరం తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాలని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాలరావు కోరారు.