గద్వాల టౌన్, వెలుగు: టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో వైఎస్సార్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని ఆరోపించారు. గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలు రద్దు కావడంతో వేలాది మంది మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రాసిన స్టూడెంట్లకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చి న్యాయం చేయాలన్నారు. ఆంజనేయులు, వెంకటస్వామి, వెంకటయ్య, గోపాల్ పాల్గొన్నారు.
నిరుద్యోగుల జీవితాలు ఆగమైతున్నయ్..
మహబూబ్ నగర్ కలెక్టరేట్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎంతో భవిష్యత్ ఉన్న ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. యువత, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డయని పేర్కొన్నారు. అబ్దుల్ సిరాజ్ ఖాద్రి, సీజే బెనహర్, లక్ష్మణ్ యాదవ్, రాము యాదవ్, సాయి బాబా, సుభాష్ కత్రే పాల్గొన్నారు.
మరికల్: ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళికకు శనివారం సాయంత్రం మండలకేంద్రంలో అఖిలపక్ష నాయకుల కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. గ్రూపు-–2 పరీక్ష వాయిదా వేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని నినాదాలు చేశారు.