- టీఎస్ పీఎస్సీ, ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆందోళన
- సక్సెస్ చేయాలని కోదండరాం, మల్లు రవి పిలుపు
హైదరాబాద్, వెలుగు : పరీక్షల నిర్వహణలో టీఎస్ పీఎస్సీ వైఫల్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టనున్నారు. మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం హైవేలపై ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఆందోళన చేపట్టనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రాస్తారోకోకు అనుమతి ఇవ్వాలని ఆల్ పార్టీ నేతలు సీఈవో వికాస్ రాజ్, డీజీపీ అంజనీకుమార్ ను కోరారు.
ఈ ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కోదండరాం విజయవాడ హైవేపై ఎల్ బీ నగర్ దగ్గర, వరంగల్ హైవేపై ఘట్కేసర్ దగ్గర, మల్లు రవి మహబూబ్ నగర్ హైవేపై పాల్గొననున్నారు. రాసారోకోలో కాంగ్రెస్, టీజేఎస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా, తెలంగాణ పీపుల్స్ జేఏసీ, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ యూ విద్యార్థి సంఘాలు కూడా పాల్గొననున్నాయి. రాస్తారోకోకు సక్సెస్ చేయాలని కోదండరాం, మల్లు రవి పిలుపునిచ్చారు.
డిమాండ్లు ఇవే
1. ప్రస్తుత టీఎస్ పీఎస్సీ బోర్డు చైర్మన్ తో సహా సభ్యులందరినీ తొలగించాలి. చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను నియమించాలి.
2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి.
3. డీఎస్సీ పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 కు పెంచాలి. (బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా )
4. పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి.