జియో యూజర్లకు మంగళవారం (సెప్టెంబర్ 17) నాడు చేదు అనుభవం ఎదురైంది. దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ డౌన్ అయింది. మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో జియో నెట్వర్క్ ఢమాల్ అయింది. దీంతో.. సోషల్ మీడియాలో జియో యూజర్లు తమ అసహనాన్ని వెళ్లగక్కుతూ పోస్టులతో చెలరేగిపోయారు.
మధ్యాహ్నం 12.36కి 10,367 జియో యూజర్లు నెట్వర్క్ ఎర్రర్ సమస్యను ఎదుర్కొన్నారు. ఉదయం 10.13 నిమిషాలకు 7 మంది, 11.13 నిమిషాలకు 653 మంది జియో యూజర్లు నెట్వర్క్ ఎర్రర్ వస్తోందని కంప్లైంట్ చేశారు. మధ్యాహ్నం 12 దాటే సమయానికి 10 వేల మందికి పైగా జియో నెట్వర్క్ నుంచి సమస్యను ఎదుర్కొన్నారు.
68 శాతం మందికి ‘నో సిగ్నల్’, 18 శాతం మందికి మొబైల్ ఇంటర్నెట్ సమస్య, 14 శాతం మందికి జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ నుంచి సమస్య ఎదురైంది. డౌన్ డిటెక్టర్ డేటా ప్రకారం.. ఇతర టెలికాం నెట్వర్క్స్ అయిన ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ టెలికాం సేవలు యథావిధిగా, నిరాటంకంగా కొనసాగాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) రీఛార్జ్ ప్లాన్ల రేట్లను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 26 శాతం ధరలను పెంచాయి. పెరిగిన ధరలు జూలై 04 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.