యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 2న యాదగిరిగుట్ట, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. పునర్నిర్మాణానికి ముందు యాదగిరిగుట్ట ఆలయానికి ఉత్తర ద్వారం లేదు. దీంతో ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని తూర్పు ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేవారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారి ప్రధానాలయానికి నలువైపులా నాలుగు రాజగోపురాలతో ద్వారాలు ఏర్పాటు చేశారు. దీంతో జనవరి 2న ఉదయం 6.48 గంటల నుంచి దాదాపు అరగంటపాటు స్వామివారు ఉత్తర ద్వారదర్శనం ఇస్తారని ఆలయ ఆఫీసర్లు చెప్పారు.
ఆరు రోజులు ఆర్జిత సేవలు బంద్
లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 2023 జనవరి 2 నుంచి 7 వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహించనున్నట్లు శనివారం ఆలయ ఈవో గీతారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. అధ్యయనోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలను ఆరు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యయనోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారి వివిధ అలంకార సేవలు నిర్వహించనున్న నేపథ్యంలో.. ప్రతిరోజు భక్తులతో ఊరేగించబడే స్వామివారి వెండి మొక్కు జోడుసేవల టైమింగ్స్ మార్చారు. జనవరి 2 నుంచి 6 వరకు ఐదు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు వెండి మొక్కు జోడు సేవలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రపతి రాక.. మూడు హెలీప్యాడ్ల ఏర్పాటు
ఈ నెల 30న ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం ఆమె హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయం నుంచి హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు రానున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టలో హెలీప్యాడ్లను ఏర్పాటు చేయడం కోసం ఏవియేషన్ ఇంజినీర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పైలట్లు యాగశాల ప్లేస్ ను పరిశీలించారు. అక్కడ వెంటనే మూడు హెలీప్యాడ్లు నిర్మించాలని ఆర్ అండ్ బీ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 27న హెలికాప్టర్లతో ట్రయల్ ఉంటుందని చెప్పారు.