జగిత్యాల జిల్లా: ఏడేండ్ల కిందట చనిపోయిన తన తమ్ముని మృతిపై అనుమానాలున్నాయంటూ మృతుడి సోదరుడు డీజేపీని ఆశ్రయించాడు. తన తమ్ముడి మృత దేహానికి రీ పోస్టుమార్టం చేయాలంటూ కోరాడు. స్పందించిన డీజీపీ మృత దేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్ పై 2015 సెప్టెంబర్ లో గుర్తు తెలియని బాలుని మృతదేహం లభ్యం అయ్యింది. బాలుడి మృతికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న మంచిర్యాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతునికి సంబంధించి బంధువులు ఎవరూ రాకపోవడంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అక్కడే ఖననం చేశారు.
అయితే మృతుడు తమ తమ్ముడు ఉమేశ్ చంద్ర(16) అంటూ మృతుడి సోదరుడు రవిచంద్ర పోలీసులను కలిసి... కుటుంబ సభ్యులతో మళ్లీ ఖననం చేశారు. అయితే తాజగా ఏడేళ్ల తర్వాత తమ తమ్ముడి మృతిపై అనుమానాలు ఉన్నాయని, రీ పోస్టుమార్టం చేయాలని డీజీపీని కోరాడు. డీజీపీ ఆదేశాలతో జిల్లా ఎస్పీ ఆ కేసును మళ్ళీ ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మల్యాల తహశీల్దార్, కేఎంసీ వైద్యుడు డాక్టర్ సురేందర్, డాక్టర్ క్రాంతి చైతన్య, మల్యాల సీఐ, ఎస్ఐ ల సమక్షంలో ఖననం చేసిన చోట త్రవ్వి అస్థిపంజరాన్ని బయటికి తీసి రీ పోస్టుమార్టం నిర్వహించారు.