హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని పిటిషన్ లో కోరారు. కోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పోలీసుల వ్యవహార శైలిపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలవడానికి కేసీఆర్ అండ్ టీం ఆడిన డ్రామా ఫెయిల్ అయిందని.. హైడ్రామా వ్యవహారానికి సంబంధించి కొత్త కొత్త వీడియోలు, ఆడియోలను తయారు చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలపై హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మునుగోడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.ఈ ప్రకటన చేసిన కాసేపటికే పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.
హై డ్రామాపై బీజేపీ సీరియస్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామాను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. నిజానిజాలు తేల్చేందుకు దేనికైనా సిద్ధమని.. ఇదంతా సీఎం కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అంటూ బీజేపీ నేతలు ఇప్పటికే తీవ్రంగా స్పందించారు. ఇదే సమయంలో.. హైకోర్ట్ లో రిట్ పిటిషన్ వేసిన బీజేపీ.. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా.. వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ఈ విధంగా కుట్ర చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ లో ఆరోపించారు. పిటిషన్ లో రాష్ట్రం హోం సెక్రటరీ, డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, కేంద్ర హోంశాఖ, సీబీఐ, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. బీజేపీ పిటిషన్ పై రేపు హైకోర్ట్ విచారించనుంది.