వివాదంలో ఉన్న భూమిలో గుడిసెలు

  •   ఐదుగురిపై కేసు

అశ్వారావుపేట, వెలుగు : కోర్టు వివాదంలో ఉన్న  భూమిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదల కంటూ గుడిసెలు వేయించారు.  భూమి కోర్టు పరిధిలో ఉందని పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎంత వాదించినా పట్టించుకోకుండా ఒక్కొక్కరికి 70 అడుగుల భూమిని కొలిచి సీపీఐ నాయకులు పాకలు వేయించారు. ఈ విషయం తెలిసి గ్రామానికి చెందిన మహిళలు తండోపతండాలుగా వివాదాస్పద భూమి లోకి వెళ్లి ఘర్షణకు దిగారు. అశ్వారావుపేటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య కోర్టు వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీపీఐ నాయకులు సలీం  ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇప్పిస్తానంటూ గుడిసెలు వేయించడంతో వివాదం చెలరేగింది.  

సలీంతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇల్లు ఉన్న వారికే  స్థలాలను కేటాయించటంతో  ఇండ్ల జాగాలు లేనివారు ఘర్షణకు దిగారు. ఇదిలా ఉండగా కెమిలాయిడ్స్​ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మూడు ఎకరాల భూమిని ఆందోళనకారులు ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఎవరికి వారే  భూమిలో సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఖాళీ చేసి వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తామని  చెప్పడంతో ఆందోళనకారులు స్థలాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు.  అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని సరిహద్దు భూముల రైతులు కోరుతున్నారు.