- ఉదయం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు..
- అందుబాటులో లక్ష లడ్డూలు
- జనవరి 2న ఉత్తర ద్వార దర్శనం
- అదే రోజు నుంచి 7వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు
- ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు బంద్
యాదగిరిగుట్ట, వెలుగు : కొత్త ఏడాది తొలిరోజు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వామి వారు నిర్విరామ దర్శనం ఇవ్వనున్నారు. జనవరి ఒకటిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకనుగుణంగా జనవరి ఒకటిన ఆలయ సమయాలు మార్చినట్లు ఈఓ గీతారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు యాదగిరిగుట్ట టెంపుల్, ఉదయం 4:30 గంటలకు పాతగుట్ట ఆలయం తెరుస్తారు. స్వామివారికి అర్చన, అభిషేకం తర్వాత ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామ దర్శనాలుంటాయి. మధ్యలో బ్రేక్ దర్శనాలు, స్వామివారికి ఆరగింపు, నివేదన కైంకర్యాలు జరుగుతాయి. భక్తులు ఎంత మంది వచ్చినా సరిపడేలా లక్ష లడ్డూలను అందుబాటులో పెట్టనున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసాద కౌంటర్లు తెరవడమే కాకుండా భక్తులకు సరిపడా పులిహోరను కూడా అందుబాటులో ఉంచనున్నారు.
జనవరి 2న ఉత్తర ద్వార దర్శనం
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణానికి ముందు ప్రధానాలయానికి ఉత్తర ద్వారం లేకపోవడంతో.. ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున తూర్పు రాజగోపుర ద్వారం గుండానే స్వామివారు భక్తులకు దర్శనమిచ్చేవారు. పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం కొండపైన నలువైపులా(తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం) నాలుగు ద్వారాలతో ప్రధానాలయాన్ని నిర్మించింది. దీంతో జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఆలయ చరిత్రలో మొదటిసారిగా స్వామివారు ఉత్తర ద్వారదర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 6:48 నుంచి 7:30 గంటల వరకు దర్శనాలు కాగా, 7:30 నుంచి 8:30 గంటల వరకు ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. పాతగుట్టలో కూడా వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంది.
జనవరి 2 నుంచి అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు చేశారు. నిత్యం నిర్వహించే సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, లక్షపుష్పార్చన కైంకర్యాలు ఉండవు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పలు అవతారాల్లో స్వామివారి అలంకార సేవలు నిర్వహించనున్నారు. ఈ కారణంగా స్వామివారికి నిత్యం భక్తులతో ఉదయం వేళలో జరిపించబడే వెండి మొక్కు జోడు సేవలను సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటలకు నిర్వహించనున్నారు.