
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం(ఫిబ్రవరి 17, 2025) లోకల్ హాలిడే ప్రకటించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు. దురాజ్ పల్లి పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సోమవారం లోకల్ హాలీడే ప్రకటించారు.
తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే పెద్దగట్టు జాతర సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత అతి పెద్దది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతులస్వామి కొలువై ఉన్నారు. ఈ జాతర దాదాపు 250 ఏండ్ల నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
పెద్దగట్టు జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఇది భారతదేశంలోని యాదవుల ఏకైక జాతరగా భావిస్తారు. ఈ ఏడాది జాతరకు దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
అందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. లింగమంతులస్వామి జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది.