బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కరీంనగర్, వెలుగు : మునుగోడు ఎన్నికల కోసం స్వేరోలు ఎంతో శ్రమించారు. కానీ నైతిక విలువలు, పవిత్ర ఆశయం కంటే అక్కడ డబ్బుల ప్రభావమే పనిచేసిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రవీణ్ కుమార్ బర్త్డే సందర్భంగా కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో బుధవారం స్వేరోలు ప్రతిజ్ఞా దివస్ పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్మాట్లాడుతూ పాలకవర్గాలు దోచుకున్న వేల కోట్ల డబ్బులు మునుగోడులోని రెండు లక్షల మందిపై కుమ్మరించారన్నారు.
తాత్కాలిక ప్రయోజనం కోసం మరోసారి అక్కడి ప్రజలు మోసపోయారన్నారు. ఇకపై ఇలా జరగకుండా ఉండాలంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తెలంగాణలో కోటి మంది మహిళలు, 50 లక్షలకు పైగా పురుషులు చదువుకోలేదన్నారు. చదువుకోకపోతే బానిసల్లా ఉండిపోతారన్నారు. తన 55వ పుట్టిన రోజు సందర్భంగా 55 నిమిషాలు పరుగెత్తానని.. స్వేరోలంతా బలహీనతల్ని గెలవాలని, బలాలు తెలుసుకోవాలన్నారు. మనకు అధికారం వచ్చినా వెంటనే మన జీవితాలు మారిపోవని, జీవన విధానం, సంస్కృతి, మన మాట తీరు మారాలన్నారు.