కులగణనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ : కేసీ వేణుగోపాల్​తో భట్టి, మహేశ్ గౌడ్ వేర్వేరుగా భేటీ

కులగణనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ : కేసీ వేణుగోపాల్​తో భట్టి, మహేశ్ గౌడ్ వేర్వేరుగా భేటీ

న్యూఢిల్లీ, వెలుగు:  కులగణనపై ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల పార్టీ ముఖ్యనేతలతో కులగణనపై శుక్రవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది. ఈ మీటింగ్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో భేటీ కావాల్సి ఉంది. 

అయితే మహేశ్ కుమార్ గౌడ్ ఫ్లైట్ రెండు గంటలు ఆలస్యం కావడంతో వేణుగోపాల్​తో నేతలిద్దరు విడివిడిగా భేటి అయ్యారు. ఈ భేటీల్లో కులగణన విధివిధానాలు, సర్వే చేపట్టనున్న తీరుపై వేణుగోపాల్ ఆరా తీశారు. ఈ నెల 28 నుంచి ఉమ్మడి జిల్లాల్లో చేపట్టబోయే కులగణన సర్వే విధానాలను నేతలు వివరించినట్లు తెలిసింది.

ప్రజా రంజకంగా పాలన

శుక్రవారం ఉదయం వేణుగోపాల్​తో భేటీ అయిన భట్టి కులగణన, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజారంజకంగా సాగుతోందని వివరించారు. గత మూడు నెలల పాలనపై రిపోర్ట్​ను అందించినట్లు తెలిసింది. హైడ్రా కూల్చివేతలు, మూసీ పునరుజ్జీవం, సంక్షేమ, అభివృద్ధికార్యక్రమాలు, ఇతర రాజకీయ అంశాలను తెలిపారు. 

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ స్పెషల్ అబ్జర్వర్ గా నియమితులైన భట్టి ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి నేతలతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్​ను గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన విషయాలను వివరించారు. అలాగే తన పర్యటనలో గుర్తించిన అంశాలు, ఇతర సమాచారాన్ని వేణుగోపాల్​కు అందజేసినట్లు సమాచారం. అనంతరం అన్ని రాష్ట్రాల నేతలతో కులగణనపై నిర్వహించిన సమావేశంలో భట్టి పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కులగణనకు సర్వం సిద్ధం చేసిందని తెలిపారు. తర్వాత పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ తో భట్టి సమావేశం అయ్యారు.

నేడు బీసీ సంఘాల ధర్నాకు మహేశ్​గౌడ్! 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ శనివారం అక్కడి బీసీ సంఘాలు నిర్వహించనున్న ధర్నాలో పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్ తో ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. దీనికి మహేశ్ గౌడ్ హాజరై తన సంఘీభావం ప్రకటించనున్నారు.

పనితీరుపై ప్రోగ్రెస్ కార్డు 

పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం సాయంత్రం కేసీ వేణుగోపాల్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్​గా నియమించినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రోగ్రెస్ రిపోర్టును అందజేసినట్టు తెలిసింది. తర్వాత రాష్ట్రంలో చేపట్టబోయే కులగణన, తాజా రాజకీయాలపై చర్చించారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం.. వాటిని ఏ విధంగా తిప్పి కొడుతున్నది వివరించారు. 

సోషల్ మీడియా, అనుకూల మీడియా, ఇతర దారుల్లో ప్రజల్ని తప్పుదారిపట్టించేలా బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఎలా చెక్ పెడుతున్నది తెలిపారు. కాగా.. తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో పార్టీ చీఫ్​ ఖర్గే, రాహుల్, ప్రియాంకను మహేశ్ గౌడ్ కలవనున్నట్లు సమాచారం. పీపీసీ కొత్త కమిటీల అంశం మహేశ్​గౌడ్​ హైకమాండ్​ ముందుంచినట్టు తెలిసింది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్య, ఆయన అలక విషయంపై కూడా హైకమాండ్ ఆరా తీసినట్లు తెలిసింది.