నిజామాబాద్‌అర్బన్, వెలుగు: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కేవలం మటలకే పరిమితమయ్యాడు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం నగరంలోని 36వ డివిజన్లో గడపగడపకు బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ నగర సుందీరకరణ పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్న దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నగరంలో కాలనీలన్నీ కంపుకొడుతున్నాయన్నారు.
ఒక్కో డివిజన్‌కు రూ.కోటి కేటాయిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాటలు నీటిమూటలుగా మారాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం ఖాయమన్నారు. ఈ నిజాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టెంట్శ్రీనివాస్, జ్యోతి, రాకేశ్, లక్ష్మీనారాయణ, రాజు, వినోద్‌రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.