నన్ను గెలిపించండి.. మధిరను మరింత అభివృద్ధి చేస్తా : లింగాల కమల్​రాజు

మధిర, వెలుగు : తనను మధిర నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభవృద్ధి చేస్తానని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్​ అభ్యర్థి లింగాల కమల్​రాజు ఓటర్లను కోరారు. కేసీఆర్​ మూడో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  మంగళవారం మధిరలో ఏర్పాటు చేసి ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగాల కమల్​రాజు మాట్లాడారు.  

తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆంధ్రా ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నారు. తాము తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో ఎందుకు ఉన్నామా అని బాధపడతున్నారని తెలిపారు. దీనిని బట్టి తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థమవుతోందన్నారు. 

దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి మొదట నాలుగు మండలాలను పైలట్​ప్రాజెక్టుగా తీసుకుంటే అందులో మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని పెట్టిన ఘనత సీఎం కేసీఆర్​దేనన్నారు. భట్టి విక్రమార్క అడగకపోయినా మధిరకు 100పడకల ఆసుపత్రి మంజూరు చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

మధిర బీఆర్​ఎస్​లో ఫుల్​ జోష్​ 

మధిరలో ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్​ కావడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఫుల్​జోష్​ వచ్చింది. మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. సభలో మధుప్రియ పాటలకు లింగాల కమల్​ రాజు స్టెప్పులు వేసి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సభలో మాజీ స్పీకర్​మధుసూదనాచారి, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, సంభాని చంద్రశేఖర్, డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, వైస్​ చైర్మన్​ దొండపాటి వెంకటేశ్వరరావు,  మున్సిపల్​ చైర్​పర్సన్​, వైస్​చైర్​పర్సన్​ మొండితోక లత, శీలం విద్యాలత వెంకటరెడ్డి, ఎంపీపీ మెండెం లలిత, ప్రజాప్రతినిధులు, బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు. 

నామాపై సీఎం ప్రశంసలు

మధిర, వైరా పర్యటనలో సీఎం కేసీఆర్​ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించారు. రైతుల వెన్నంటూ ఉండే నాయకుడని  అని మెచ్చుకున్నారు. ‘నామా నాగేశ్వరరావు ఈ మధ్య నన్ను కలిసిన్రు. వైరా ప్రాజెక్టులో నీటి నిల్వలు లేక, ప్రాజెక్టు కాల్వల కింద వేసిన పంటలు సాగునీరు అందక ఎండిపోతున్నాయని చెప్పిన్రు. 

ALSO READ :  వెలుగు కార్టూనిస్ట్​కు ఇంటర్నేషనల్ అవార్డు

వెంటనే నేను అధికారులతో మాట్లాడిన. ప్రాజెక్టులోకి నీటిని వదిలేలా చేసిన. ఇప్పుడు ప్రాజెక్టు నీటితో బ్రహ్మాండంగా ఉంది. పంటలకు సాగునీటి సమస్య కూడా తీరిపోయింది. అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇది సాధ్యమా’ అని కేసీఆర్​ ప్రశ్నించారు. వడగండ్ల వానకు మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నాయని, ఆ సందర్భంగా తాను, నామా నాగేశ్వరరావుతో కలిసి బోనకల్ మండలంలో పర్యటించిన సమయంలో ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించి రైతులను ఆదుకున్నామని సీఎం గుర్తుచేశారు.