
మావోయిస్టులకు సామాన్లు చేరవేస్తున్న ముఠా అరెస్ట్
రూ.76.57 లక్షలు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం
భూపాలపల్లి అర్భన్, వెలుగు : మావోయిస్టులకు నగదు, ఇతర వస్తువులు చేరవేస్తున్న నలుగురిని బుధవారం కాటారం పోలీసులు అరెస్ట్- చేశారు. గురువారం జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ సురేందర్‌రెడ్డి వివరాలు తెలియజేశారు. బుధవారం సాయంత్రం మహాదేవపూర్ రోడ్డు కాటారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తుండగా బ్లాక్ కలర్ స్కార్ఫియో వచ్చిందని, అనుమానంతో తనిఖీ చేయగా రూ.76.57 లక్షల నగదు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ట్యాబ్, మందులు, సిరప్ లు, వాచీలు, న్యూట్రిషన్ పౌడర్ , కార్డెక్స్ వైర్, టవల్స్ దొరికాయన్నారు. వెహికల్లో ఉన్న నలుగురిని ప్రశ్నించగా సామగ్రినంతా మావోయిస్టులకు చేరవేస్తున్నట్టు చెప్పారన్నారు.
నిందితుల్లో కరీంనగర్ కు చెందిన అబ్దుల్ అజీజ్, మొహమ్మద్ అబ్దుల్ రజాక్, చత్తీస్‌గఢ్‌కు చెందిన జనగామ రాఘవ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన కౌసర్ అలీ ఉన్నారన్నారు. మహ్మద్రవూఫ్, ఆత్రం నారాయణ, మారుపాక రామయ్య, వర్గీస్, భాస్కర్, దిలీప్, ఉంగాల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నిందితులను పట్టుకున్న ఓఎస్డీ అశోక్ కుమార్, కాటారం డీఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, సీఐ రంజిత్ రావు, ఎస్సై శ్రీనివాస్, మాహదేవపూర్ఎస్సై రాజకుమార్, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణరావు, కొయ్యూరు ఎస్ఐ నరేశ్, అడవి ముత్తారం ఎస్ఐ సుధాకర్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.