న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన బుధవారం కూడా అదానీ వ్యవహారంపై రగడ కొనసాగింది. ఉభయ సభలు ప్రారంభం అవ్వగానే.. న్యూయార్క్‌లో అదానీపై నమోదైన కేసు, మణిపూర్‌లో హింస, యూపీలోని సంబాల్లో జరిగిన అల్లర్ల ఘటనపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని కాంగ్రెస్ సహా పలు అపోజిషన్ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని అటు లోక్‌సభ స్పీకర్, ఇటు రాజ్యసభ చైర్మన్ కోరినా సభ్యులు పట్టించుకోలేదు. 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభను.. స్పీకర్ ఓం బిర్లా, మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభను కూడా చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ 11.30 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత ఉభయ సభలు ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో గురువారానికి వాయిదాపడ్డాయి.
రాజ్యసభలో ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు..
గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ మళ్లీ వాయిదా తీర్మానం ఇచ్చింది. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన చేపట్టాయి. ఎంపీల నినాదాల మధ్యే చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. అపోజిషన్ పార్టీల సభ్యులు పదే పదే ప్రశ్నోత్తరాల సెషన్‌ను అడ్డుకున్నారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళకు దిగారు. అయినప్పటికీ.. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చర్చకు అనుమతి ఇవ్వలేదు. అదానీని ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నాడంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. ఢిల్లీలో క్రైమ్ గ్రాఫ్ పెరగడంతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. రాజ్యాంగంలోని 267 నిబంధన ప్రకారం.. సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీసు ఇచ్చారు. అదానీ ఇష్యూపై 18 వాయిదా తీర్మాన నోటీసులు వచ్చాయని చైర్మన్ ధన్‌ఖడ్ తెలిపారు. వాటిని రిజెక్ట్ చేసేందుకు కారణం ఉందన్నారు.
లోక్‌సభలోనూ అదానీ వ్యవహారంపై రగడ..
లోక్‌సభలోనూ అపోజిషన్ పార్టీ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. అదానీ ముడుపుల వ్యవహారం, మణిపూర్‌లో హింస, వయనాడ్‌లో విరిగిపడిన కొండ చరియల ఘటనపై చర్చకు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సెషన్‌కు సహకరించాలని సభ్యులను స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేసినా.. వాళ్లు పట్టించుకోలేదు. మణిపూర్ హింసపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. మణిపూర్‌లో పెరుగుతున్న హింస.. దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి స్థాపనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఏడాదిగా మణిపూర్‌లో హింస కొనసాగుతున్నా.. ప్రధాని మోదీ స్పందించడం లేదన్నారు. పరిపాలనా వైఫల్యమే.. సామాన్యుల మరణాలు, విధ్వంసానికి దారితీసిందని ఆరోపించారు.
ఈ ఏడాది విమానాలకు 994 బెదిరింపు కాల్స్
ఈ ఏడాది ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు 994 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నకు విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సమాధానమిచ్చారు. 2022 ఆగస్టు నుంచి 2024 నవంబర్ 13 వరకు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు మొత్తం 1,143 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని వెల్లడించారు. 2022లో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 27 బాంబు బెదిరింపు కాల్స్ రాగా, 2023లో ఆ సంఖ్య 122కు పెరిగిందని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఆ సంఖ్య 994కు చేరిందని తెలిపారు. ఈ కాల్స్ అన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. బాంబ్ థ్రెట్ కంటింజెన్సీ ప్లాన్ (బీటీసీపీ)లో భాగంగా ప్రతి ఎయిర్ పోర్ట్‌లో బాంబు బెదిరింపులను లెక్కించడానికి, ఆ సమస్యలను పరిష్కరించడానికి బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (బీటీఏసీ)ని ఏర్పాటు చేశామని చెప్పారు.
సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టాలు తేవాల్సిందే: అశ్వినీ వైష్ణవ్
సోషల్ మీడియాలో అభ్యంతకర కంటెంట్‌ను అరికట్టేందుకు కొత్త చట్టాలు అవసరమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పుడున్న చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఈ అంశంపై దృష్టిసారించాలని సూచించారు. కఠిన చట్టాలు చేసే విషయమై ఏకాభిప్రాయం అవసరమని, దీనిపై ప్రతిపక్షాలు చర్చలు జరుపుతాయని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. మన దేశ సంస్కృతికి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వచ్చిన దేశాల కల్చర్‌కు చాలా తేడా ఉన్నదని అన్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ దుర్వినియోగాన్ని ఇప్పుడున్న చట్టాలు, యంత్రాంగం సమర్థంగా అడ్డుకోలేకపోతున్నాయని, కఠిన చట్టాలు చేసే ప్రతిపాదన ఉన్నదా? అని బుధవారం లోక్‌సభలో బీజేపీ సభ్యుడు అరుణ్ గోవిల్ ప్రశ్న అడిగారు. వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ అవుతున్న కంటెంట్‌ను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. లోక్‌సభలో గోవిల్ ప్రశ్నకు అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. నియంత్రణ లేకపోవడం వల్లే అభ్యంతకర కంటెంట్‌కు సోషల్ మీడియా వేదికగా మారిందని అన్నారు. ఫేక్ కంటెంట్‌తో ప్రజాస్వామ్యానికే ముప్పని తెలిపారు. ఏదైనా విషయం కరెక్టా? కాదా? అని నిర్ణయించటానికి ఎడిటోరియల్ చెక్స్ ఉండేవని, ఇప్పుడు అలాంటివి లేవన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ స్వీయ నియంత్రణను పాటించాలని సూచించారు.