కర్నాటకలో మరోసారి డబుల్ ​ఇంజిన్  ​సర్కారు

గత తొమ్మిదేండ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ‘సబ్​కా సాథ్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్, సబ్​కా ప్రయాస్’ అనే నినాదంతో దేశం ప్రగతిపథంలో ముందుకు వెళ్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ సంకల్పంతో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తూ 18 రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్​కు పట్టం కట్టారు. సామాజిక న్యాయం పేరుతో చాలా రాజకీయ పార్టీలు గతంలో దేశంతో ఆడుకున్నాయి. కానీ 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాజిక న్యాయం అమల్లోకి వచ్చింది. వెనుకబడిన వర్గాల ప్రజలను సమాజంలో చైతన్య పరుస్తూ వారిని రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు నడిపించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోంది. స్వాతంత్య్రానంతరం తొలిసారి రాష్ట్రపతి అభ్యర్థిగా నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన మహిళను ప్రతిపాదించడం అందులో భాగమే. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో మోడీ సామాజిక న్యాయం ప్రతిబింబించే విధంగా అనేక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించారు. నేడు కేంద్ర ప్రభుత్వంలో 35 శాతం మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 27 మంది ఓబీసీ మంత్రుల్లో ఐదుగురు క్యాబినెట్ మంత్రులకు, సహాయ మంత్రులకు స్థానం కల్పించారు. దేశం అంతటా ప్రాతినిధ్యం ఉండేలా 15 రాష్ట్రాల ఎంపీలకు మంత్రులుగా ప్రాధాన్యం కల్పించారు. ఇది దేశ చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. తొలిసారిగా అత్యంత వెనుకబడిన వర్గాలైన యాదవ్, కుర్మీ, జాట్, గుర్జార్, ఖండాయత్, భండారి, బైరాగి, టీ ట్రైబ్, ఠాకోర్, కోలి, వొక్కలిగ తులు గౌడ, ఎజవ, లోధ్, అగ్రి, వంజరి, మైతేయి, నాట్, మల్లాహ్-నిషాద్, మోద్ తేలీ, దర్జీ, వంటి వర్గాలకు మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించిందంటే వెనుకబడిన వర్గాల ఆకాంక్షల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. మండల్ కమిషన్ అమలులోకి వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2018లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు మోడీ ప్రభుత్వం రాజ్యాంగ హోదా కల్పించింది. మొట్ట మొదటిసారిగా సంచార జాతులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. అఖిల భారత వైద్య విద్య సీట్లలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇలా అనేక విషయాల్లో మునుపెన్నడూ లేని విధంగా దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలికింది బీజేపీ ప్రభుత్వం.

డబుల్ ప్రయోజనం

డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ప్రతి పల్లె, ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతాయని ప్రజలు విశ్వసించి నేడు అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికే పట్టం కడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం గడిచిన మూడున్నరేండ్లుగా కర్నాటకను అభివృద్ధిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. యడ్యూరప్ప, బొమ్మై నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం కర్నాటక ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించింది. డబుల్ ఇంజిన్ అంటే డబుల్ సంక్షేమం, డబుల్ రాపిడ్ డెవలప్​మెంట్​తో దేశ అభివృద్ధిలో కర్నాటక దూసుకుపోతోంది. అందులో భాగంగా నేషనల్ హైవేస్, రైల్వే, విమానాశ్రయాలకు భారీ నిధులు కేటాయించింది. గత మూడున్నరేండ్లుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కర్నాటకకు రూ.2,26,418 కోట్లతో వివిధ పథకాలు తీసుకొచ్చింది. యూపీఏ ప్రభుత్వం పదేండ్ల గత పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.99,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. కర్నాటకలో ఎస్సీ వర్గీకరణ,15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను17 శాతానికి, 3% రిజర్వేషన్ ఉన్న ఎస్టీ రిజర్వేషన్ ఏడు శాతానికి పెంచింది. 2% అదనంగా లింగాయత్​లకు, 2% వొక్కలిగలకు రిజర్వేషన్ పెంచింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఉచిత రేషన్, ఉచిత ఆరోగ్యం, జనధన్, ముద్ర, జీవజ్యోతి, అటల్ పెన్షన్ వంటి అనేక పథకాలను డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందించింది. గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య మోడల్ స్కూళ్లను 400కు పైగా ఏర్పాటు చేసింది. గిరిజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ రూ.25 వేల కోట్ల బడ్జెట్​ను కేటాయిస్తే.. బీజేపీ దాన్ని ఐదు రెట్లు పెంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లకు పెంచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలోని దాదాపు11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నది. కర్నాటకలో దాదాపు 54 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కర్నాటకలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దీనికి ఏటా మరో రూ.4,487 కోట్లు జోడించింది. అదనంగా రూ.4000 అందిస్తున్నది. ఈ విధంగా కర్నాటకలో రైతులకు ఏటా రూ.10,000 ఆర్థిక సాయం అందుతోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 17 లక్షల మందికి ఇళ్లు మంజూరయ్యాయి. ఇలా డబుల్ సంక్షేమం మరింతగా ప్రజల దగ్గరికి చేరాలంటే.. అది కేవలం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది.

కాంగ్రెస్, జేడీఎస్​లవి అధికార దాహం

కర్నాటకలో ఆర్థిక ప్రగతి, సుస్థిరత కోసం బీజేపీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే, అధికార దాహం కోసం కాంగ్రెస్, జేడీఎస్ ఆరాటపడుతున్నాయి. డబుల్ సంక్షేమాన్ని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా ప్రజలకు దూరం చేయాలని కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్​లు నేడు ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తూ వారిని మోసం చేయడానికి మరోసారి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ రెండూ వంశపారంపర్య పార్టీలు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్​ల ప్రభుత్వాలు “కుటుంబమే మొదట" అనే విధానంతో కర్నాటక ప్రజలకు అభివృద్ధిని దూరం చేశారు. కానీ నేడు డబుల్ ఇంజిన్ (మోడీ, బసవరాజు బొమ్మై) ప్రభుత్వం ఏర్పడ్డాక “ప్రజలే మొదట” అనే నినాదంతో కర్నాటకను అన్ని రంగాల్లో డెవలప్​చేశారు. ఇందిరా గాంధీ కాలం నుంచి నేడు రాహుల్ వరకు ఎన్నికల సమయంలో మాత్రమే పేదలు, రైతుల గురించి మాట్లాడతారు. తర్వాత మరిచిపోతారు. కాంగ్రెస్​నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడకుండా, ప్రపంచం మొత్తంలో భారతదేశ కీర్తిని పెంచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రధాని మోడీ అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ, బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ముందుకు వెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం విభజించు, పాలించు అనే రీతిలో ముందుకు వెళ్తున్నది. గతంలో యూపీలో శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రాముడిని అవమానిస్తే.. అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను భూస్థాపితం చేశారు. ఇవాళ కర్నాటక ప్రజలు కూడా... భజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ పార్టీని ఓటు అనే ఆయుధంతో రాజకీయ సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వెంపర్లాడుతున్నాయి.. ఇలాంటి పార్టీలకు మే పదో తారీఖున జరిగే ఎన్నికల్లో కర్నాటక ప్రజలు తమ ఓటు ద్వారా తప్పకుండా బుద్ధి చెప్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కర్నాటకలో మరోసారి భారీ మెజారిటీతో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.

- డా.కె. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు