
హాకీ ఆటను ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియా. ఆ ఆటను దశాబ్దాల పాటు ఏలింది మన ఇండియా. ఒలింపి క్స్‌లో అత్యధికంగా ఎనిమిది బంగారు పతకాలతో స్వర్ణ చరిత్ర సృష్టించింది మన దేశమే. కాలం కలిసిరాక 41 ఏండ్ల పాటు మరో మెడల్ నెగ్గలేకపోయినా.. టోక్యోలో తిరిగి పతకాల బాట పట్టిన ఇండియా పారిస్‌లోనూ దాన్ని పున రావృతం చేసింది. 52 ఏండ్ల తర్వాత వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకంతో మెరిసి మురిసింది. ఇండియాకు పెట్టని గోడలా.. ప్రత్యర్థులకు అడ్డుగోడగా నిలిచి ఆఖరాట ఆడిన లెజెండరీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు ఘన వీడ్కోలు పలికింది.
పారిస్:
ఇండియా హాకీ వీరులు అద్వితీయ ఆటతో అదరగొట్టారు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకంతో దేశాన్ని మురిపించారు. స్వర్ణ చరిత్ర పునరావృతం కాకపోయినా.. మరోసారి కాంస్య కాంతులు విరజిమ్మి పురాతన ఆటకు మరోసారి జవసత్తులు అందించారు. గురువారం జరిగిన కాంస్య పతక ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఇండియా 2–1తో స్పెయిన్‌ను చిత్తు చేసి మెగా గేమ్స్‌లో దేశానికి నాలుగో పతకం తెచ్చిపెట్టింది. టోర్నీ అసాంతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో డబుల్ ధమాకా మోగించాడు. స్పెయిన్ తరఫున మార్క్ మిరల్లెస్ 18వ నిమిషంలోనే గోల్ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లగా... హర్మన్ 30, 33 నిమిషాల్లో వెంటవెంటనే రెండు గోల్స్‌తో జట్టును గెలిపించాడు. తన ఆఖరాటలోనూ కీపర్ పీఆర్ శ్రీజేష్ ఇండియా రక్షకుడిగా నిలిచి వరుసగా రెండు ఒలింపిక్ మెడల్స్‌తో కెరీర్‌ను పరిపూర్ణంగా ముగించాడు.
హర్మన్ డబుల్ ధమాకా
క్వార్టర్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ బెల్జియంను చిత్తు చేసి ఆశ్చర్య పరిచిన ఇండియా ఈ మ్యాచ్‌ను జాగ్రత్తగా ప్రారంభించింది. సమయం గడుస్తున్న కొద్దీ జోరు పెంచింది. తొలి క్వార్టర్ మధ్యలో ప్రత్యర్థి రక్షణ శ్రేణిలోకి వెళ్లి దాడులు ప్రారంభించింది. కానీ, స్పష్టమైన అవకాశాలను సృష్టించడంలో విఫలమైంది. అదే సమయంలో స్పెయిన్ కూడా గోల్ అవకాశాలను రాబట్టలేకపోయింది. రెండో క్వార్టర్ మొదలైన మూడు నిమిషాల్లో పెనాల్టీ స్ట్రోక్ ద్వారా స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది. సర్కిల్‌లో మన్‌ప్రీత్ సింగ్ చేసిన తప్పిదంతో రిఫరీ ప్రత్యర్థికి పెనాల్టీ స్ట్రోక్ ఇవ్వగా.. మార్క్ మిరాల్లెస్ ఇండియా కీపర్ శ్రీజేష్ అడ్డుదాటి టాప్ కార్నర్ నుంచి బాల్‌ను నెట్‌లోకి కొట్టాడు.
కొద్దిసేపటికే ఆ టీమ్‌కు మరో రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా.. ఆధిక్యం డబుల్ కాకుండా ఇండియా అడ్డుకుంది. సస్పెన్షన్ కారణంగా సెమీస్‌కు దూరమైన అమిత్ రోహిదాస్ రాకతో ఇండియా మిడ్ ఫీల్డ్ బలం పెరిగింది. అదే సమయంలో స్పెయిన్ మరో గోల్ కొట్టినంత పని చేసింది. బోర్జా లాసల్లే కొట్టిన షాట్ పోస్ట్‌పై నుంచి బయటకు వెళ్లగా.. తర్వాతి పెనాల్టీ కార్నర్‌లో స్పెయిన్ ప్రయత్నాన్ని శ్రీజేష్ నిలువరించాడు. ఫస్టాఫ్ చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేసిన హర్మన్ 1–1తో జట్టును బ్రేక్‌కు తీసుకెళ్లాడు.
విరామం నుంచి వచ్చిన వెంటనే తను మళ్లీ మ్యాజిక్ చేశాడు. మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టును 2–1తో ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఈ టోర్నీలో అతనికి పదో గోల్ కావడం విశేషం. కొద్దిసేపటికే అతనికి హ్యాట్రిక్ గోల్ చాన్స్ కూడా వచ్చింది. రెండు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్‌ను స్పెయిన్ కీపర్ లూయిస్ కాల్జాడో అడ్డుకున్నాడు. ఈ దశలో స్కోరు సమం చేసేందుకు స్పెయిన్ ఆటగాళ్లు విశ్వ ప్రయత్నాలు చేశారు.
40వ నిమిషంలో జోస్ బాస్టెర్రా పెనాల్టీ కార్నర్ ప్రయత్నంతో పాటు నాలుగు నిమిషాల తర్వాత పెపె కునిల్ కొట్టిన షాట్‌ను కూడా శ్రీజేష్ సేవ్ చేశాడు. చివరి క్వార్టర్‌లో స్పెయిన్ పూర్తిగా ఎటాకింగ్ గేమ్ ఆడింది. ఆఖర్లో గోల్ కీపర్‌ను కూడా తొలగించి ఆడినా ఇండియా డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. శ్రీజేష్ మరో రెండు అద్భుతమైన సేవ్స్‌తో జట్టుకు విజయం అందించాడు.