రాహుల్ వర్సెస్ కల్యాణ్.. మరోసారి ఇండియా కూటమిలో భిన్న స్వరాలు

రాహుల్ వర్సెస్ కల్యాణ్.. మరోసారి ఇండియా కూటమిలో భిన్న స్వరాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‎గా సాగుతున్నాయి. బిలియనీర్ గౌతమ్ అదానీ లంచం ఆరోపణలపై చర్చకు పట్టబడుతూ ప్రతి రోజు ఉభయ సభలు ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేపడుతుండటంతో లోక్ సభ, రాజ్య సభ వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఉభయ సభల వాయిదాల పర్వంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సభల్లో వివరణాత్మక చర్చలు జరగకుండా ప్రతి రోజు ఒకటే అంశంపై చర్చకు పట్టుబడుతూ సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం సరికాదని ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్యపక్షమైన తృణమాల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 

బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రకారమే సభ నడుస్తోందని.. సభ ఎంత కాలం నడవాలో వారే నిర్ణయిస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని టీఎంసీ సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. సంఖ్యా బలం ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‎లకు మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. మాకు తక్కువ సమయం ఉంటుందని.. ఈ కొంత సమయాన్ని కూడా ఆందోళనలతో కాంగ్రెస్, బీజేపీ సభను పక్కదారి పట్టిస్తుండటంతో సభలో తమ సమస్యలు ప్రస్తావించే ఛాన్స్ లేక ఇతర పార్టీలు బాధపడుతున్నాయని అన్నారు. అంతకుముందు పార్లమెంట్ బయట కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

ALSO READ | Rahul Gandhi: కిరాణా షాపులో సేల్స్మెన్గా రాహుల్ గాంధీ..ఢిల్లీ వీధుల్లో సందడి

 ఉభయ సభలు సజావుగా సాగాలని.. సభల్లో నిర్మాణాత్మక చర్చ జరగాలన్నదే విపక్షాల లక్ష్యమని రాహుల్ పేర్కొన్నారు. సభలో నాకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఏం దుష్ప్రాచారం చేసిన పర్వాలేదని.. డిసెంబర్ 13న మాత్రం సభలో రాజ్యాంగంపై చర్చ జరగాలని కోరారు. వాళ్లు మాపై ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని హామీ ఇస్తున్నానని రాహుల్ అన్నారు. అలాగే ఇవాళ (డిసెంబర్ 11) లోక్ సభ స్పీకర్‎ను కలిశానని.. సభలో బీజేపీ సభ్యులు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డ్స్ నుండి తొలగించాలని కోరానన్నారు. 

ఈ క్రమంలోనే రాహుల్ వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ పై విధంగా స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ సభ నడవాలనుకుంటనే నడుస్తోందని.. లేదంటే వాయిదా పడుతోందని.. ఇది సరైన పద్దతి కాదని ఎంపీ కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి మెల్లగా బీటలు వారుతోంది. ఇండియా కూటమిని నడిపించే కెపాసిటీ రాహుల్ గాంధీకి లేదని.. కూటమి సారథ్య పగ్గాలను టీఎంపీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని కూటమిలోనే డిమాండ్లు వినిపిస్తు్న్నాయి. ఈ క్రమంలోనే సభ వాయిదాల పర్వం ఇండియా కూటమిలో మరోసారి భిన్న స్వరాలు వినిపించడం గమనార్హం.