ఇల్లెందు బీఆర్ఎస్​లో మళ్లీ భగ్గుమన్న విభేదాలు .. ఎమ్మెల్యే, మున్సిపల్​ చైర్మన్​ వర్గాల మధ్య  లొల్లి 

భద్రాద్రికొత్తగూడెం/ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు బీఆర్​ఎస్​లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. సోమవారం దసరా వేడుకల సందర్భంగా  ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియ, మున్సిపల్​ చైర్మన్​ డి. వెంకటేశ్వరరావు వర్గాల మధ్యవిభేదాలు  బహిర్గతమయ్యాయి. నిన్న, మొన్నటి వరకు ఒకరిపై మరొకరు ఆరోపణలకే పరిమితం కాగా,  ప్రస్తుతం బాహాబాహీకి దిగారు. 

జరిగింది ఇదీ.. 

దసరా వేడుకల్లో భాగంగా ఇల్లెందులో ప్రతి ఏడాది రథోత్సవ వేడుకలు  జరుగుతున్నాయి.  పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలను దసరా రోజు ఊరేగిస్తూ గ్రౌండ్​కు తీసుకువస్తారు. ఇక్కడే జమ్మిపూజ జరుగుతుంటుంది. ఈసారి ఎన్నికల కోడ్​ నేపథ్యంలో ఏర్పాట్లపై మున్సిపాలిటీ పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే భర్త హరిసింగ్​ చొరవ తీసుకొని బీఆర్ఎస్​ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్​ను నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే హరిప్రియ మున్సిపాలిటీలోని 24వార్డుల కౌన్సిలర్లను స్టేజీ మీదకు పిలిచారు. ఇదే సమయంలో చైర్మన్​ డి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏర్పాట్లు సరిగా చేయలేకపోయమని, కమిటీ కూడా అంతంతమాత్రంగానే చేసిందని అంటుండగా అక్కడే ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ దిండిగాల రాజేందర్​తో పాటు ఎమ్మెల్యే అనుచరులు అడ్డుపడ్డారు. ఇరు పక్షాల మధ్య స్టేజీపైనే తీవ్ర స్థాయిలో వాగ్వావాదం జరిగింది. 

ఉత్సవ కమిటీ ప్రకటన.. 

ఈ విషయమై మంగళవారం దసరా ఉత్సవ కమిటీ రిలీజ్​ చేసిన ప్రకటనలో మున్సిపల్​ చైర్మన్​ పై సభ్యులు విమర్శలు గుప్పించారు. మున్సిపల్​ చైర్మన్​ కావాలనే ఉత్సవాల్లో అవాంతరాలు సృష్టించేందుకు యత్నించారంటూ ఆరోపించారు. ప్రోగ్రామ్​ను అభాసు పాల్జేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. చైర్మన్​ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

పదిరోజులు గడవకముందే.. 

మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్​ కవిత బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే, మున్సిపల్​ చైర్మన్​ వర్గాలతో  చర్చలు జరిపి సమన్వయం చేశారు. ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగి పది రోజులు గడవక ముందే మరోసారి విభేదాలు బయట పడడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఉత్సవ కమిటీ అంటే అన్ని పార్టీల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులతో ఉండాలే తప్ప బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన ఒక వర్గం వారే ఎలా ఉంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే భర్త హరిసింగ్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు పార్టీలో వెల్లువెత్తుతున్నాయి.  

చైర్మన్​ ప్రెస్​మీట్​ 

మున్సిపల్​ చైర్మన్​ దమ్మలపాటి వెంకటేశ్వరరావు తమ వర్గానికి చెందిన కౌన్సిలర్లతో మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో మాట్లాడుతూ ఎమ్మెల్యే వర్గం తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తమను పార్టీలోంచి పొమ్మన లేక పొగపెడ్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్​ కారణంగా దసరా ఉత్సవాలకు వచ్చిన ప్రజలకు అనుకున్న విధంగా ఏర్పాట్లను మున్సిపాలిటీ పాలకవర్గం నుంచి చేయలేకపోయామని చెప్పడం తప్ప అని ప్రశ్నించారు.

ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీలో దిండిగాల రాజేందర్ శకుని పాత్ర పోషిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. తాము గతంలో ఎమ్మెల్యేకు బీఫామ్ ఇవ్వొద్దని అన్న మాట వాస్తవమే అయినప్పటికీ, సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రి హరీశ్​రావు సూచనల మేరకు ఎమ్మెల్యే గెలుపు కోసమే పనిచేస్తున్నామని కానీ, ఎమ్మెల్యే వెంట ఉంటూ కట్టప్ప పాత్ర పోషిస్తున్న రాజేందర్ లాంటి నాయకులతో ఓటమి తప్పదన్నారు.