- నేడు రైతు తన బంగారమంతా అమ్ముకునే స్థాయికి చేరాడు
- రాజీవ్ రైతు దీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
నిజామాబాద్: నా చిన్న తనంలో క్వింటాలు పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది.. నేడు పసుపు రైతు బంగారం అమ్ముకునే స్థాయికి దిగజారిపోయాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు రైతులకు మద్దతుగా ఆర్మూర్ లో చేపట్టిన రాజీవ్ రైతు దీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడీ పాల్గొన్నారు. నిజామబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా సాగు చేసే పసుపు రైతుల పరిస్ధితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అష్ట కష్టాలుపడి సాగు చేస్తే.. తీరా దిగుబడి వచ్చాక రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ఎకరానికి 1.20 లక్షలు పెట్టుబడి అవుతుంటే గిట్టుబాటు ధర కేవలం 5-6 వేలుగా ఉందని ఆయన పేర్కొన్నారు. కిలోల బంగారం ధరించే సీఎం కేసీఆర్ కూతురు కవితకి పసుపు రైతుల కష్టాలు కానరాలేదని, కవితమ్మ కనుమారుగయ్యాక ఎంపీ అర్వింద్ కొత్త నాటకానికి తెరతీశాడని ఆయన ఆరోపించారు. నా నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో బాండ్ పేపర్లు రాయటం నేను మోదటి సారి చూశానని, బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్ మీద 420 చీటింగ్ కేసు పెడతామని ఆయన హెచ్చరించారు. మా ప్రాంతంలోని షుగర్ ఫ్యాక్టరీలు మూసేసిన ఘనత కేసీఆర్ దేనని దుయ్యబట్టారు. కేసీఆర్ తీరుతో చెరకు రైతులు రోడ్డున పడ్డారని, పార్లమెంటులో పసుపు అంశం, షుగర్ ఫ్యాక్టరీ అంశం మీద మాట్లాడాలని ఎంపీ రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున రైతు సమస్యల మీద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచుతామని, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలల్లో ఎంఎస్పీ అంశం లేనేలేదని.. బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు రెండూ దొందూదొందే నన్నారు. ఖరిఫ్ పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రల ద్వారానే పంట కొనుగోలు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
పీఆర్సీపై టీచర్ల ఆగ్రహం.. త్రివేణి సంగమంలో పీఆర్సీ ప్రతుల నిమజ్జనం
టెన్త్ అర్హతతో పోస్టల్ జాబ్స్.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ