కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లు

కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లు
  •  సరఫరాకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు
  •  రాష్ట్రంలో 65 లక్షల ఎకరాలకుపైగా సాగుకు అనుకూలం
  •  ఇప్పటికే సీడ్‌‌‌‌  ఉత్పత్తి వివరాలు సేకరించిన వ్యవసాయ శాఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో పత్తిసాగు కోసం విత్తన ఏర్పాట్లు షురూ అయ్యాయి. వచ్చే సీజన్‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో పత్తిసాగుకు అవకాశాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారి అంచనాలకు తగినట్టు కోటిన్నర విత్తన ప్యాకెట్ల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. పత్తి విత్తనాలు రాష్ట్రం  నుంచే ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో విత్తనాలు సేకరిస్తున్న కంపెనీలతో వ్యవసాయ శాఖ అధికారులు సీడ్‌‌‌‌  ఉత్పత్తిపై చర్చించి ప్రొడక్షన్‌‌‌‌  వివరాలు సేకరించారు. 

రాష్ట్ర అవసరాలకు తగిన విధంగా సీడ్‌‌‌‌  ప్యాకెట్లను సిద్ధం చేయడానికి ఇప్పటికే సీడ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రూపొందించారు. ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏ జిల్లాకు ఎంత సీడ్‌‌‌‌  అవసరమో గుర్తించి సరఫరాకు ఏర్పాట్లు చేశారు. మే నెలలో గోదాములకు తరలించి అక్కడి నుంచి ఆయా కేటాయింపుల వారీగా జిల్లాలకు, డిస్ట్రిబ్యూటర్లకు  తరలించనున్నారు. 

70 వేల క్వింటాళ్ల పత్తి సీడ్స్ అవసరం

వానాకాలం సీజన్‌‌‌‌లో రాష్ట్రంలో పత్తిసాగు ఎక్కువగా  జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసవరాలకు తగిన విధంగా పత్తి విత్తనాలు పంపిణీ చేసే బాధ్యతను వ్యవసాయ శాఖ బీటీ కాటన్‌‌‌‌  విక్రయించే ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. రాష్ట్రంలో 65 లక్షల ఎకరాలకు పైగా వేసుకోవడానికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో సాగుకు 70 వేల క్వింటాళ్ల పత్తి సీడ్స్‌‌‌‌  అవసరం అవుతాయనే అంచనాలు ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలు 475 గ్రాముల ఒక్కో ప్యాకెట్‌‌‌‌ను మార్కెట్‌‌‌‌లో విక్రయించేందుకు కాటన్‌‌‌‌  సీడ్స్‌‌‌‌ సిద్ధం చేస్తున్నారు. 

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కాటన్‌‌‌‌  సీడ్లకు ధరలను నిర్ణయించింది. బీటీ కాటన్‌‌‌‌  ప్యాకెట్‌‌‌‌  ధర రూ.864 చొప్పున విక్రయించుకునేందుకు కేంద్రం అనుమతించింది. నిరుడు ఇదే ప్యాకెట్‌‌‌‌  రూ.853 ఉండేది. ఈయేడు ప్యాకెట్‌‌‌‌కు మరో రూ.11 పెంచింది. రాష్ట్రంలో 40 వరకు కంపెనీలు బీజీ 2 విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. మైకో, రాసీ, నూజివీడు  కంపెనీలే దాదాపు 65 శాతం బీటీ కాటన్‌‌‌‌  సీడ్‌‌‌‌  అమ్ముతున్నాయి. 

దేశంలో ఏటా పెరుగుతున్న పత్తిసాగు

రాష్ట్రంలో గత ఏడాది మినహా గత దశాబ్ద కాలంగా పత్తిసాగు గణనీయంగా పెరుగుతోంది. వాతావరణం కాటన్‌‌‌‌  సాగుకు అనుకూలంగా ఉందని గ్రహించిన రైతులు పత్తిసాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గతంలో పత్తి రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో కొంత తగ్గినా, ఆ తరువాత కాటన్‌‌‌‌  కార్పొరేషన్‌‌‌‌  ఆఫ్‌‌‌‌  ఇండియా కొనుగోళ్లు చేపడుతుండడంతో కాటన్‌‌‌‌  మార్కెట్‌‌‌‌ మరింత విస్తరించింది. ఫలితంగా పత్తికి డిమాండ్‌‌‌‌  పెరుగుతూ వస్తోంది. గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో కాటన్‌‌‌‌  దిగుబడి గణనీయంగా తగ్గింది. 

2023–24  ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 32.3 మిలియన్‌‌‌‌  బేళ్ల  పత్తి ఉత్పత్తి జరిగింది. 2022–23లో 36 మిలియన్‌‌‌‌  బేళ్ల ఉత్పత్తి జరిగింది. నిరుటితో పోలిస్తే 4 శాతం దిగుబడి పడిపోయింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అత్యధిక దిగుబడి 2013–14 సంవత్సరంలో 38 మిలియన్‌‌‌‌  బేళ్లుగా నమోదైంది. అయితే 2002–03 నుంచి 2013–14 వరకు పంట దిగుబడి 167 శాతం పెగడంతో పాటు ఉత్పత్తి 316 శాతం పెరిగింది.