- జవహర్ నగర్ పీఎస్‌లో హిట్ అండ్ రన్ కేసు
జవహర్ నగర్, వెలుగు: జవహర్ నగర్ పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ కార్పొరేషన్ బీజేఆర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ పూస చంద్రశేఖర్, లక్ష్మి దంపతులు. వీరికి ముగ్గురు కుతూళ్లు ఉండగా, చిన్న కూతురు జయశ్రీ (18 నెలలు) బుధవారం సాయంత్రం ఇంటి బయటకు ఆడుకుంటోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది.
దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.