
స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్.. అనే కొటేషన్ చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఓవర్ స్పీడ్ ప్రమాదంటూ హైవేల్లో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హోర్డింగ్స్ తో ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ జనాల్లో అవగాహన మాత్రం రావట్లేదు.ముఖ్యంగా యూత్.. చేతిలో బైక్ లేదా కార్ ఉందంటే చాలు ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్తుంటారు. అలా ఓవర్ స్పీడ్ లో వెళ్లి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తల్లిదండ్రులకు కడుపుకోత విధిస్తున్నారు చాలామంది. హైదరాబాద్ లో ఓవర్ స్పీడ్ వల్ల జరిగిన కార్ యాక్సిడెంట్ లో ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( మార్చి 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట నియో పోలీస్ సర్కిల్ ఆటోస్టాండ్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం. అతివేగంగా వచ్చి ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టడంతో కారు నాలుగు పల్టీలు కొట్టి తుక్కుతుక్కుయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని సమాచారం.
గండిపేట్ లోని కాలేజీ నుంచి హైదరాబాద్ వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మితి మీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.