లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా దారుణ హత్య కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. సంజీవ్ జీవాను హత్య చేసేందుకు నిందితుడు విజయ్ యాదవ్ రూ.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా కేవలం రూ.5వేలు మాత్రమే తీసుకున్నాడు. హత్య జరిగిన తర్వాత మిగతా పెండింగ్ అమౌంట్ ఇస్తామనే ఒప్పందం జరిగింది. హత్యకు గురయ్యే వ్యక్తి ఎవరో కూడా తెలియకుండానే.. కేవలం రూ.20 లక్షలకు డీల్ ఒకే కావడంతో విజయ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో తేలింది. ఇందులో భాగంగానే రూ.20లక్షలకు డీల్ ఒకే కాగానే లఖ్‌నవూ సివిల్ కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను చంపేశాడు విజయ్ యాదవ్.
లఖ్‌నవూ సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగానే సంజీవ్ జీవా జూన్ 7వ తేదీన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన నిందితులు జీవాపై కాల్పులు జరపడంతో అతడు స్పాట్ లోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు ఓ బాలిక గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు.
జీవాపై అనేక క్రిమినల్ కేసులు ఉండటంతో ఓ కేసులో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో హత్య జరిగింది. పశ్చిమ యూపీలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన సంజీవ్ జీవా వివాదాస్పద నేత ముఖ్తార్ అన్సారీకి అత్యంత సన్నిహితుడు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో అన్సారీ నిందితుడిగా ఉండగా.. సహ నిందితుడిగా జీవా ఉన్నాడు.
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ పోలీస్ కస్టడీలో హత్యకు గురైన రెండు నెలల్లోనే మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు గురికావడం యూపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.