ఒక దేశం- ఒకే ఎన్నికతో.. దశ-దిశ మారుతది

ఒక దేశం- ఒకే ఎన్నికతో.. దశ-దిశ మారుతది

మనదేశంలో రాజకీయంగా, ఎన్నికలపరంగా చరిత్రను మలుపు తిప్పే సంస్కరణలు చేపట్టేందుకు ఇది అత్యంత కీలక సమయం. ఒక దేశం, ఒక ఎన్నిక అన్నది కచ్చితంగా దేశాన్ని మలుపు తిప్పుతుంది. పేదరిక నిర్మూలన, ప్రజాసంక్షేమం, సుపరిపాలన, సమిష్ఠి అభివృద్ధిపై ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. వలసవాదులు ఎప్పుడో  చూపిన బాటలోనే ఇప్పుడు కూడా నడిస్తే దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఏటా ఎక్కడో ఓ చోట ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకునే విధానాన్ని మనం ఆచరిస్తుండటమే దీనికి నిదర్శనం. దీన్ని ఎవరూ ప్రశ్నించలేదు కాబట్టి అది అలా సాగిపోతోంది.

సరైన నాయకత్వం కలిగిన ఏ దేశమైనా ప్రస్తుత విధానాలను సమీక్షించి అవసరమైతే దాంట్లో సంస్కరణలు తీసుకొస్తుంది. సంస్కరణలు అనేవి సమర్థతను పెంచడంతోపాటు ఉత్పాదకతపై ప్రభావం చూపి, ముందస్తుగా నిర్ణయించిన సామాజిక ఫలితాలు సాధించాలి. పరిపాలనలో అవినీతి, అవాస్తవికత, తక్కువ ఉత్పాదకత, సంక్షేమ పథకాలపై ఆధారపడే తీరు అలవర్చుకోవడం, తక్కువ స్థాయి చదువులు, పేదరికం వంటి సవాళ్లకు ఎన్నికల విధానమే కారణమని నేను నమ్ముతాను. బ్యాలెట్ పేపర్ల నుంచి ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్లకు మారడం మినహా గడిచిన 70 ఏండ్లుగా ఎన్నికలపరంగా భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌, గత ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓటర్ల లెక్కలు, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, రాజకీయాల స్వభావం, ఎన్నికల ప్రక్రియ 70 ఏండ్లుగా మారలేదా? భవిష్యత్‌‌ అవసరాలకు తగిన వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం లేదా?

దేశంలో 70 ఏండ్లుగా నిర్లిప్తంగా సాగుతున్న ఎన్నికల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రశ్నించే సాహసం చేస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటనా లేకున్నా ప్రస్తుత ప్రభుత్వ కాలంలోనే ఈ సంస్కరణలు తీసుకువచ్చేందుకు మేధోమథనం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఒక దేశం- ఒక ఎన్నిక అన్నది ఎలక్షన్‌‌‌‌ రిఫామ్‌‌‌‌ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా నిలుస్తున్న ఇండియాలో అది రాజకీయ, సామాజిక, ఆర్థిక  సంస్కరణలకు దారితీస్తుంది. ఈ సంస్కరణ ఆచరణలోకి వస్తే దాని ద్వారా సానుకూలమైన మార్పు వస్తుందని భావిస్తున్నాను.

పరిపాలనా రాహిత్యం

రాజ్యాంగం నిర్దేశించిన ఐదేండ్ల వ్యవధికి ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సి రావడం సరికాదు. ఆ ఎన్నికల ఫలితాలను కేంద్రానికి అనుకూలమైనా లేదా ప్రతికూలమైనా రెఫరెండంగా పరిగణించడానికి వీల్లేదు. కానీ, అవగాహన ఆధారంగా సాగే రాజకీయాల్లో అడపాదడపా జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ రాజకీయ సంకల్పాన్ని బలహీనపరుస్తాయి. దాంతో పరిపాలనా అజెండా అమలు, అత్యవసర సంస్కరణలు అమలు చేసే శక్తి సన్నగిల్లుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పరిస్థితి సవాళ్లతో కూడుకునే ఉంటుంది. తమను ఎన్నుకున్న పరిపాలనా ఎజెండాపై దృష్టి నిలపడం కాకుండా ఆ ఐదేండ్ల కాలంలో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. అవి విధాన రూపకల్పన ప్రక్రియ, అమలును నెమ్మదించేలా చేయడమే కాదు ఆ ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాల వేగానికి కళ్లెం వేస్తాయి.

అవినీతిపరుడైన ఓటరు

ఎన్నికల రాజకీయాలు ఓటరును కూడా అవినీతిపరుడిగా మార్చేశాయి. దేశవ్యాప్తంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో డిమాండ్‌‌ చేసే ఓటర్లు కనిపిస్తున్నారు. వీరు ఓటు కోసం నగదు(నోట్‌‌ ఫర్‌‌ ఓట్‌‌) డిమాండ్‌‌ చేస్తున్నారు. ఎక్కువ ఎవరైతే ఇస్తారో వారికే పడతాయి ఓట్లు. సామాజిక సంఘాలు, వృత్తినిపుణుల సంఘాలు, కులసంఘాలే కాదు కాలనీ సంఘాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసే వారి నుంచి బహిరంగంగా, నిస్సిగ్గుగా లంచాలు డిమాండ్ చేస్తున్నాయి. దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ఓటుకు రూ.1,500 చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం దిగజారిపోయి తాను ఓటు వేసినందుకు ఓటరే డబ్బు డిమాండ్ చేసే పరిస్థితి రావడమన్నది ఎన్నికల వ్యవస్థ హీనస్థితిని చాటిచెప్తోంది. ఇలాంటి అయోగ్యకరమైన ప్రక్రియ ద్వారా ఎన్నికైన ప్రతినిధులు ఎలా ఉంటారో ఎవరైనా ఊహించవచ్చు. ఒక దేశం- ఒక ఎన్నిక విధానం వెంటనే ఎన్నికల అవినీతిని అరికట్టలేకపోవచ్చు కానీ, క్రమంగా మార్పు తీసుకువస్తుంది.

రాజకీయాల్లో నాణ్యత

ఒక దేశ తలరాత ఆ దేశ రాజకీయాల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ, రాజకీయ వ్యవస్థలో కంపు కారణంగా మన ప్రజాస్వామ్యం ఎంతో మూల్యాన్ని చెల్లించింది. యువత, మేధావులు, విద్యావంతులు, నైతిక విలువలు కలిగి ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడం మన ప్రస్తుత ఎన్నికల విధానాన్ని, మన రాజకీయాల్లో నాణ్యతను తెలియజెప్తున్నాయి. ఖర్చు చేయగల సత్తాను చూపడం ఎన్నికల్లో పోటీ చేయాల్సిన వ్యక్తి ప్రధాన అర్హతగా మారడం దురదృష్టకరం. మన దేశ రాజకీయ నాణ్యత సగటు కంటే తక్కువే ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే సదరు వ్యక్తి అవినీతిపరుడై ఉండటం ప్రధాన లక్షణంగా మారింది. ప్రతీ ఎన్నికల తర్వాత ఇది ఒక నియమంగా బలపడిపోతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి అనధికారిక ఖర్చు రూ.6 కోట్లు దాటిపోయింది. అలాగే ఎంపీ అభ్యర్థి ఖర్చు రూ.25 కోట్లు మించిపోయింది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అసాధారణమైన ఖర్చు చేసిన వ్యక్తికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుందా? ఇంత పెద్ద మొత్తాల్లో డబ్బు ఖర్చు చేసే పోటీదారులు ముగ్గురి నుంచి నలుగురు వరకు ఉంటారనే విషయం మరువకూడనిది. ఎన్నికల్లో ఇంత భారీగా ఖర్చు చేసేవారికి ప్రజలకు సేవ చేయడం కాకుండా  కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయన్నది వాస్తవం. ఈ ప్రయోజనాలు అందుకునేవారికి ఎన్ని ఎన్నికలుంటే అంత పెద్ద పండుగ.

అప్పుడే మార్పన్నది సాధ్యం

ప్రజాస్వామ్యంలో రాజకీయ సంస్కరణల ద్వారానే భారీ మార్పన్నది సాధ్యం. భారీ సామాజిక మార్పులో సంఘటిత ఉద్యమం అవసరం. కానీ, రాజకీయాలు, ఎన్నికల ఆచరణలో మార్పును కచ్చితమైన, పటిష్ఠమైన చట్టం, కొత్త ఎన్నికల విధానం ద్వారా వేగంగా సంస్కరించవచ్చు. నోటి మాటగా కాకుండా మొత్తం ఎన్నికల వ్యవస్థను మార్చాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఒక దేశం-ఒక్క ఎన్నిక అన్నది లోపరహితమైన సంస్కరణ. ఈ ఒక్కదాని ద్వారా అవసరమైన సామాజిక, రాజకీయ సంస్కరణలను తీసుకురావచ్చు. అంచనా వేసేందుకు, మదింపు చేసేందుకు ఇదేమీ కష్టమైన పనికాదు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌‌ ఎన్నికలు ఐదేండ్లకోసారి ఒకేసారి నిర్వహించినట్టు అయితే భారీ సామాజిక, రాజకీయ మార్పు సాధించవచ్చు. పరిపాలనలో నిరంతర ఆటంకాలు ఉండవు కాబట్టి సంక్షేమం, అభివృద్ధిని అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా తరచు వచ్చే ఎన్నికల కారణంగా ఎన్ని కోట్ల పనిగంటలు నష్టపోతున్నామో చెప్పేందుకు ఎటువంటి కొలమానాలు లేవు. దేశప్రగతి, అభివృద్ధికి సంబంధించి విధాన నిర్ణయాలు అమల్లోకి తెచ్చేందుకు ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతున్నాం. ఈ చారిత్రక అవకాశాన్ని అందిపుచ్చుకొని దశను మార్చే ఎన్నికల సంస్కరణకు మద్దతు తెలిపేందుకు అన్ని రాజకీయ పక్షాలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఎదగాల్సిన అవసరం ఎంతో ఉంది.

పెరుగుతున్న ఎన్నికల వ్యయం

దేశంలో ఎన్నికలు అత్యంత ఖరీదైన వ్యవహారం. వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు ఏటా జరిగే ఎన్నికల్లో  పన్ను చెల్లింపుదారులకు చెందిన వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఎన్నికల నిర్వహణ అన్నది అంత ఖరీదైన వ్యవహారంగా మనదేశంలో పరిగణించడం లేదు. కానీ వాస్తవం ఏమిటంటే అది ఎంతో ఖరీదైనది. తమ విధులు పక్కన పెట్టి ఎన్నికల అధికారులుగా వ్యవహరించే అధికారుల ఖర్చు ఇప్పటి వరకూ లెక్కించలేదు. కొత్త ఎన్నికల విధానం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వ ఖజానాను న్యాయబద్ధంగా, సమర్ధవంతంగా ఉపయోగించవచ్చు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులు అనేక రెట్లు పెరిగిపోయాయి. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగిన సగటు వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడమన్నది గగనమే. అసంబద్ధ సంక్షేమ పథకాల ద్వారా ప్రాంతీయ పార్టీలు పరోక్షంగా ఓటర్లకు తాయిలాలు పంచుతున్న సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. తమ సొంత అవినీతి సొమ్మును ఖర్చు చేయకుండా పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే డబ్బును ఈ ప్రాంతీయ పార్టీలు తెలివిగా పంచుతూ ఓటర్లు తమ పార్టీకి విశ్వసనీయంగా ఉండేలా చూసుకుంటున్నాయి.

అవినీతి

ఎలక్షన్స్‌‌‌‌ అనేవి దశాబ్దాలుగా అనేక రకాల అవినీతికి ఆయువుపట్టుగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టగలరనే దానిపై టికెట్లు ఇచ్చినట్టయితే నిజాయితీపరులు, ఉత్తములకు ఆ లిస్ట్‌‌‌‌లో చోటు దొరకదు. అవినీతిపరులు ఎన్నికల బరిలో నిలిచి వారిలో కొందరు విజయం సాధిస్తే.. వారు ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తారని ఆశించడం ఎండమావే అవుతుంది. ఇది దశాబ్దాలుగా సాగుతున్న ఒక అవినీతి విషచక్రం, దీన్ని చక్కదిద్దాలి. అవినీతిపరులైన రాజకీయ నాయకులు వ్యవస్థలో మరింత అవినీతిని జొప్పిస్తారు. ఇలాంటి వారిని అంగీకరించడం దురదృష్టకరమైన సామాజిక మార్పు. ఇదే ఏడు దశాబ్దాలుగా సాగుతోంది. ఈ అసాంఘిక శక్తులను సమాజం అంగీకరించి వారిని ఎన్నుకున్నట్టయితే సమాజ ఆలోచనా ధోరణి ఎలా ఉందో ఎవరైనా అంచనా వేయవచ్చు. అవినీతి విధానాలను సమాజం అంగీకరించడమన్నది ఎన్నికల ప్రక్రియతో మొదలవుతుంది, కానీ అది అక్కడితో ఆగదు.                     – కృష్ణసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి