ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ—-–1 ఎగ్జామ్ డిసెంబర్ 28 నుంచి మార్చి నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. 35,208 పోస్టులకు 1.26 కోట్ల మంది పోటీపడుతున్నారు. ఈ కీలక టైంలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఏయే అంశాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి? స్కోరింగ్ పెంచే టాపిక్స్ ఏవి? మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రీవియస్ పేపర్స్ విశ్లేషణ ఎంత వరకు ఉపయోగపడుతుంది? లాంటి అంశాలను చర్చిద్దాం.
సీబీటీ-1 ఎగ్జామ్‌లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
1) జనరల్ అవేర్నెస్ ( 40 మార్కులు); 2) మ్యాథమెటిక్స్ ( 30 మార్కులు); 3) జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ ( 30 మార్కులు). మొత్తం 100 ప్రశ్నలను 90 నిమిషాల్లో సాధించాలి. సరైన సమాధానానికి ఒక మార్కు, తప్పు సమాధానానికి వన్ థర్డ్ కోత విధిస్తారు. ప్రతి ప్రశ్నకు సుమారు 54 సెకండ్ల సమయం ఉంటుంది. ప్రశ్నల సరళి కొంతవరకు సులభంగా ఉన్నా సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తే అక్యూరసీ, స్పీడ్ పెంచుకోవచ్చు.
జనరల్ అవేర్నెస్పై పట్టు..
జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా అభ్యర్థి ముఖ్యంగా స్టాటిక్ జీకే, కరెంట్ ఎఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ , కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలి.
కరెంట్ ఎఫైర్స్ లో భాగంగా ప్రతి రోజు కనీసం రెండు న్యూస్ పేపర్స్ చదవాలి. గడిచిన సంవత్సర కాలంలో జరిగిన వివిధ రకాల సదస్సులు, సమావేశాలు వాటి థీమ్స్, రాజకీయ మార్పులు, ఆర్థిక సామాజిక మార్పులు, ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం, మొదలగు సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక అవగాహన పెంపొందించుకోవాలి.
స్టాటిక్ జీకేలో ముఖ్యాంశాలు
దేశాలు – రాజధానులు – కరెన్సీలు; దేశాలు – అధ్యక్షులు; దేశాలు – జాతీయగీతాలు; దేశాలు – జాతీయ పుష్పాలు; అంతర్జాతీయ సంస్థలు – భూసరిహద్దులు
ప్రసిద్ధ కట్టడాలు; జలసంధులు; నదితీర నగరాలు
పార్కులు, బయోస్పియర్ రిజర్వాయర్లు; ప్రముఖ సరస్సులు – జలపాతాలు; గిరిజన తెగలు – నృత్యాలు
గ్రంథాలు – రచయితలు కమిటీలు – కమిషన్లు – ఆపరేషన్లు; ప్రథమ వ్యక్తులు; ముఖ్యమైన దినోత్సవాలు; జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు; సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఫోకస్ చేయాలి.
చరిత్ర: హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ప్రధానంగా వివిధ యుద్ధాలు, ఒడంబడికలు జరిగిన సంవత్సరాలు, జైన, బౌద్ధ మతాలు, రాజవంశాల కాలక్రమం, ముఖ్యమైన శాసనాలు, రాజులు – బిరుదులు, ప్రముఖ కవులు, గ్రంథాలు – రచయితలు, భక్తి ఉద్యమకారులు, భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు, దండయాత్రలు, బ్రిటీష్ కాలంలోని కమిషన్లు, స్వాతంత్ర్య సమరయోధులు మొదలగు అంశాలు చదవాలి.
పాలిటీ: పాలిటీలో రాజ్యాంగ పరిషత్ ముఖ్యంశాలు, రాజ్యాంగంలోని భాగాలు, షెడ్యూల్స్, ముఖ్యమైన ప్రకరణలు, రాజ్యాంగ సవరణలు, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్, సుప్రీంకోర్ట్, రాష్ట్రప్రభుత్వం, హైకోర్టు లాంటి అంశాలపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవాలి.
ఎకానమీ: అర్థశాస్త్రంలో నీతిఆయోగ్, ద్రవ్యం, జాతీయాదాయం, పేదరికం, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్, వ్యవసాయరంగం, పారిశ్రామికరంగం, సేవారంగం, ఆర్థికసర్వే లాంటి అంశాలు ప్రిపేర్ అవ్వాలి.
జాగ్రఫీ: జాగ్రఫీలో హిమాలయాలు, అడవులు, పీఠభూములు, ఖనిజాలు, నదీవ్యవస్థ, దేశనైసర్గిక స్వరూపం, రైల్వే వ్యవస్థ, విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, మహాసముద్రాలు, పంటలు, రుతువులు మొదలగు అంశాల గురించి అవగాహన పెంచుకోవాలి.
జనరల్ సైన్స్: జనరల్ సైన్స్‌లో భాగంగా వ్యాధులు, రక్తవర్గాలు, విటమిన్లు, భౌతికశాస్త్ర కొలతలు, ప్రమాణాలు, ఆవర్తనపట్టిక, ఆమ్లాలు– క్షారాలు, రసాయనిక నామాలు చదవాలి.
ప్రాక్టీస్‌తో మ్యాథ్స్‌లో స్కోరింగ్
ఈ విభాగంలో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అంశాలు ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడంతో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో తెలుస్తుంది.
అర్థమెటిక్: సంఖ్యావ్యవస్థ, నిష్పత్తి-అనుపాతాలు (వయస్సులు, భాగస్వామ్యం), శాతాలు (లాభనష్టాలు, బారువడ్డీ –చక్రవడ్డీ), సరాసరి, కాలం-–పని (పైపులు తొట్టెలు), కాలం-–దూరం ( రైళ్లు, పడవులు ప్రవాహాలు).
ప్యూర్ మ్యాథ్స్: ప్రాథమిక బీజగణితం, రేఖాగణితం, సాంఖ్యాకశాస్ర్తం, త్రికోణమితి, క్షేత్రమితి టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి.
ప్రతి టాపిక్కు నిర్దిష్టమైన సమయం కేటాయించుకొని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. దీంతో స్పీడ్, అక్యూరసీ పెరిగి ఎక్కువ స్కోర్‌తో అనుకున్న జాబ్ సాధించవచ్చు.
రీజనింగ్‌పై స్పెషల్ ఫోకస్
ఈ విభాగంలో భాగంగా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది కావున ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్‌లో సీటింగ్ అరేంజ్మెంట్, ఫజిల్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రమ్స్ మరియు డాటా ఇంటర్‌ప్రిటేషన్‌కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అనాలజీ, భిన్నపరీక్ష, శ్రేడులు, కోడింగ్ – డీకోడింగ్, గణిత పరిక్రియలు, రక్త సంబంధాలు, దిక్కులు, ర్యాంకింగ్, తీర్మానాలు, వెన్ డయాగ్రామ్స్, మిస్సింగ్ నంబర్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఫజిల్స్, డేటా ఇంటర్ ప్రిటేషన్ టాపిక్స్‌పై ఫోకస్ చేయాలి.