
₹4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్వో
వేములవాడ, వెలుగు: పై అధికారి ‘లంచం’ మాటున దాక్కున్నాడు. మహిళా అధికారిని ముందుపెట్టి తతంగం నడిపించాడు. వారంలో ప్రమోట్ కావాల్సి న ఆమె ఉద్యోగ జీవితంపై అవినీతి మచ్చ పడింది. అదీ తన ఆఫీసులోనే పనిచేసే ఉద్యోగి వద్ద నుంచే డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడిపోయింది. ఆమెతో పాటు పై అధికారికీ కేసుల మరక అంటింది. ఈ ఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లో జరిగింది.
గొల్లపల్లి సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ వద్ద నుంచి ₹4 లక్షలు లంచం తీసుకుంటున్న ఇన్చార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) అనితను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ లంచం తతంగానికి సూత్రధారి అయిన జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీనివాస రావుపైనా అధికారులు కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఇటీవలే గొల్లపల్లికి బదిలీ అయ్యారు. గతంలో సిరిసిల్లలో పనిచేసిన క్రమంలో వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ₹45 లక్షల విలువైన పనులు చేయించారు. దానికి సంబంధించిన బిల్లు తాజాగా విడుదలైంది. ఆ బిల్లును విడుదల చేసిన జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీనివాస రావు.. అందులో 15 శాతం కావాలని ఎఫ్ఆర్వో అనిత ద్వారా ఒత్తిడి చేయించాడు. 10 శాతం ఇచ్చేందుకు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకూ వివరించాడు. వారి స్కెచ్‌లో భాగంగా గురువారం ఆఫీసులోనే ₹4 లక్షలు ఇచ్చేందుకు వెళ్లాడు. డబ్బులు తీసుకుంటున్న అనితను అధికారులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
6 నెలల క్రితం కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఈలోపే ఎఫ్ ఆర్వో దొరికిపోవడం డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది. ఎఫ్ఆర్వో అనితకు వారంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్‌గా ప్రమోషన్ రావాల్సి ఉంది. ఇప్పుడీ లంచం గొడవతో ప్రమోషన్ కాదు కదా.. ఉద్యోగమే గందరగోళంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.