ఊరికొకటే బడి!

ఊరికొకటే బడి!

రాష్ట్రంలో విద్యార్థులు త‌‌‌‌క్కువ‌‌‌‌గా ఉన్న స‌‌‌‌ర్కారీ బ‌‌‌‌డుల‌‌‌‌ను మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోందా, ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ, హైస్కూళ్లను కలిపేయనుందా, మొత్తంగా ఊరికొక బడిని మాత్రమే కొనసాగించాలని భావిస్తోందా, ఇందుకోసం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందా.. ఈ ప్రశ్నలన్నింటికీ విద్యాశాఖవర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఇప్పుడు ఎండకాలం సెలవులు కొనసాగుతున్న సమయంలోనూ సర్కారీ స్కూళ్ల వివరాలన్నింటినీ సేకరించడం ఈ సందేహాలను బలపరుస్తోంది. ఒక్క విద్యార్థీ లేని స్కూళ్లతోపాటు పది మందిలోపు ఉన్న వాటినీ మూసివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

చాలా రోజులుగా ప్రతిపాదన
రాష్ట్రంలో మొత్తం 25,206 సర్కారీ స్కూళ్లున్నాయి. వీటిలో 25లక్షలకు పైగా స్టూడెంట్స్‌‌‌‌ చదువుతున్నారు. అయితే కొన్నేండ్లుగా త‌‌‌‌క్కువ విద్యార్థులున్న పాఠ‌‌‌‌శాల‌‌‌‌లను మూసివేయాల‌‌‌‌ని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల ఆందోళనలతో వెనక్కి తగ్గుతోంది. రెండోసారి ఫుల్‌‌‌‌ మెజార్టీతో అధికారంలోకి వ‌‌‌‌చ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. 2019–20 విద్యా సంవ‌‌‌‌త్సరం ప్రారంభం నాటికే స్కూళ్ల రేషనలైజేషన్​ ప్రక్రియ పూర్తి చేసే ఆలోచ‌‌‌‌న‌‌‌‌లో ఉన్నట్టు సమాచారం.

‘జీరో’ స్కూళ్లపై ఫోకస్..
ట్రైబ‌‌‌‌ల్ వెల్ఫెర్ ప‌‌‌‌రిధిలోని సుమారు 300 స్కూళ్లు, స్కూల్ ఎడ్యుకేష‌‌‌‌న్ ప‌‌‌‌రిధిలో 600కు పైగా స్కూళ్లలో ఒక్క స్టూడెంట్​ కూడా లేరు. ఈ ‘జీరో’స్కూళ్లలో టీచర్లు కూడా లేరు. వీటిని అధికారికంగా మూసివేయ‌‌‌‌కుండా.. టీచ‌‌‌‌ర్లను మాత్రం వేరే స్కూళ్లకు డిప్యూటేష‌‌‌‌న్‌‌‌‌పై పంపించారు. ఈ బ‌‌‌‌డుల‌‌‌‌ను అధికారికంగా మూసివేయాల‌‌‌‌ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు స‌‌‌‌మాచారం. ఇలా చేయడం ద్వారా సెంటర్‌‌‌‌ నుంచి ఫండింగ్‌‌‌‌ కూడా ఎక్కువగా వచ్చే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. అయితే అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలోని 10,781 ప్రైమ‌‌‌‌రీ, అప్పర్‌‌‌‌ ప్రైమ‌‌‌‌రీ స్కూళ్లలో 40 మందిలోపే స్టూడెంట్లు ఉన్నారు. 1,196 హైస్కూళ్లలో వంద మందిలోపే స్టూడెంట్లు ఉండటం గమనార్హం.

ప‌‌‌‌ది మందిలోపు ఉన్నవాటిని కూడా..
2018–19 విద్యా సంవ‌‌‌‌త్సరం పూర్తయినా ఇంకా స్కూళ్లలోని విద్యార్థుల అధికారిక లెక్క పూర్తి కాలేదు. ఈ నెలాఖ‌‌‌‌రులోగా యూడైస్ పూర్తి చేసేందుకు అధికారులు చ‌‌‌‌ర్యలు తీసుకుంటున్నారు. ఆ వివరాల ఆధారంగానే ప‌‌‌‌ది మందిలోపు స్టూడెంట్లున్న ప్రైమ‌‌‌‌రీ, అప్పర్‌‌‌‌ ప్రైమ‌‌‌‌రీ స్కూళ్లను మూసివేయాల‌‌‌‌ని ప్రాథ‌‌‌‌మికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 40 మందిలోపు స్టూడెంట్లున్న హైస్కూళ్లను కూడా మూసివేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేష‌‌‌‌న‌‌‌‌లైజేష‌‌‌‌న్‌‌‌‌లో భాగంగా మూసివేసే బ‌‌‌‌డుల్లోని పిల్లల‌‌‌‌ను ద‌‌‌‌గ్గర్లోని స్కూళ్లలో చేర్పించేలా చ‌‌‌‌ర్యలు తీసుకోనున్నారు.