ఆన్లైన్​ గేమ్ ఆడి.. రూ.95లక్షలు పోగొట్టిన యువకుడు

ఆన్లైన్​ గేమ్ ఆడి.. రూ.95లక్షలు పోగొట్టిన యువకుడు

ఆ యువకుడు ‘king 527’ అనే ఆన్లైన్​ గేమ్ ను తన ఫోన్లో డౌన్​ లోడ్​ చేసుకొని సరదాగా ఆడాడు. అయితే ఈసారి అతడు ఆడిన గేమ్​.. ఇంతకుముందు ఆడిన గేమ్లలా సాఫీగా సాగలేదు. అతడి ఫోన్​ నంబర్​ తో లింక్​ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ను ఖాళీ చేస్తూ గేమ్​ ముందుకుసాగింది. చూస్తుండగానే బ్యాంక్​ అకౌంట్​ లోని దాదాపు రూ.95 లక్షలన్నీ అయిపోయాయి. విస్తుపోయే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ అయిన విషయాన్ని యువకుడు వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వెంటనే వారు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

‘king 527’ గేమ్​ ఆడి డబ్బులు పోగొట్టిన ఆ యువకుడు ప్రస్తుతం నిజాం కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.  గేమ్​ లో పోగొట్టిన ఆ డబ్బులన్నీ సీతారాంపూర్ గ్రామంలో భూనిర్వాసితుల పరిహారం కింద తమకు ప్రభుత్వం నుంచి వచ్చినవేనని యువకుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపారు.  తమకు జీవితంలో ఆసరాగా ఉంటాయని భావించిన భూ పరిహారం డబ్బులన్నీ క్షణాల్లో అకౌంట్​ నుంచి ఖాళీ అయ్యాయని తలుచుకొని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. సైబర్​ నేరగాళ్లను గుర్తించి, తమకు డబ్బులు తిరిగి ఇప్పించాలని వారు పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.