మళ్లీ తగ్గిన పాల సేకరణ రేటు

మళ్లీ తగ్గిన పాల సేకరణ రేటు
  • రూ. 3 తగ్గించిన మదర్​ డెయిరీ
  • పెరిగిన దాణా రేట్లు..

యాదాద్రి, వెలుగు : ఒక వైపు దాణా రేట్లు పెరుగుతూ ఉంటే.. మరోవైపు పాల సేకరణ ధరను డెయిరీలు తగ్గిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనే ధరలు తగ్గించిన మదర్​ డెయిరీ తాజాగా మరోసారి తగ్గించింది. ఈ రేట్లు నవంబర్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మదర్​ డెయిరీ, విజయ డెయిరీ కంటే ప్రైవేట్​ డెయిరీలు ఎక్కువగా పాలు సేకరిస్తున్నాయి. 

ఇటీవల కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల నుంచి పాలు ఎక్కువగా వస్తున్నాయని, దీంతో డిమాండ్​ పడిపోయిందని గతంలో మదర్​ డెయిరీ, విజయ డెయిరీల కంటే ఎక్కువ రేటు ఇచ్చే ప్రైవేట్​ డెయిరీలు రేటును లీటరుకు రూ. 8 నుంచి రూ. 10 వరకూ తగ్గించాయి. గతంలో 3 శాతం ప్యాట్​ ఉన్న ఆవు పాలకు రూ. 40 నుంచి రూ. 42 చెల్లించే హెరిటేజ్​ డెయిరీ ఇప్పుడు రూ. 33 చెల్లిస్తోంది. 5 శాతం ప్యాట్​ వచ్చే గేదె పాలకు గతంలో లీటరుకు రూ. 50కి పైగా చెల్లించగా ఇప్పుడు రూ. 40 చెల్లిస్తున్నారు. 

లీటర్​కు రూ. 3 తగ్గించిన మదర్​ డెయిరీ

 సొసైటీల్లో లీటర్​ ఆవు పాలకు రూ. 1.50, గేదె పాలకు రూ. 3 చొప్పున తగ్గిస్తున్నట్టు మదర్​ డెయిరీ ప్రకటించింది. నాన్​ సొసైటీల్లో లీటర్​ ఆవు పాలకు రూ. 4, గేదె పాలకు రూ. 5 చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పాల సేకరణ గతం కంటే రోజుకు 50 వేల లీటర్లు పెరగడం వల్ల నిల్వలు పెరిగిపోతున్నాయని తెలిపింది. పాలను బల్క్​గా కొనేవారు లేకపోవడంతో పేరుకున్న నిల్వలను పౌడర్​గా మారుస్తున్నామని పేర్కొంది. దీనివల్ల డెయిరీకి నష్టాలు వస్తున్నాయని, అందుకే పాల సేకరణ రేటును తగ్గించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం 5 శాతం ప్యాట్​ వచ్చిన గేదె పాలకు సొసైటీల్లో రూ. 39.50 ఇస్తుండగా దానిని ఇప్పుడు రూ. 36.50కు తగ్గించారు. 3 శాతం ప్యాట్​ వచ్చిన ఆవు పాలకు లీటర్​కు ప్రస్తుతం 33.35 ఇస్తుండగా ఇప్పుడు రూ. 31.85 కు తగ్గించారు. ఈ రేట్లు నవంబర్​ 1 నుంచి అమల్లోకి వస్తాయని మదర్​ డెయిరీ ప్రకటించింది. 

పెరిగిన దాణా రేట్లు

పాడి పశువులకు పత్తి పిట్టు, గోధుమ, తవుడు, పల్లీ, కంది, మక్కలను దాణాగా ఉపయోగిస్తున్నారు. గతంలో పోలిస్తే వీటి ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయి. . గతం కంటే కిలోకు రూ. 30 నుంచి రూ. 50 వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. 8 నుంచి 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవు, గేదెకు ప్రతీ రోజుకు 5కిలోల దాణా పెట్టాల్సి ఉంటుంది. పశుగ్రాసం తోపాటు, మందుల ఖర్చు   అదనంగా ఉంటుంది. ఆవుగాని, గేదె గాని ఒకటి కొనాలంటే రైతు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టి పాడి రంగంలో దిగితే పాల సేకరణ రేట్లను తగ్గిస్తున్నారని, దీనివల్ల నష్టం తప్ప లాభం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.