- ఒక్కో గాడిదను లక్షన్నరకు అమ్మిన డాంకీ ప్యాలెస్
- లీటర్ పాలు రూ. 1,600కు కొంటామని ఆశపెట్టిన సంస్థ
- 400 మంది రైతుల నుంచి భారీగా వసూళ్లు
- మూడు నెలలు పైసలిచ్చి పరార్
- తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో మోసాలు
- లబోదిబోమంటున్న బాధితులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గాడిద పాల పేరుతో ఓ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. ఈ పాలతో భారీ లాభాలు పొందొచ్చంటూ తమిళనాడుకు చెందిన ‘డాంకీ ప్యాలెస్’ అనే సంస్థ ఏకంగా 400 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమాయకులను ఆశ పెట్టి తమ దగ్గర గాడిదలు తీసుకుంటే వాటి పాలను లీటర్‌కు రూ.1600 చొప్పున కొంటామని నమ్మబలికింది. ఫస్ట్ సెంటర్‌ను ఒక ఐఏఎస్ఆఫీసర్తో ప్రారంభింపజేసి, ఆ వీడియోతో యూట్యూబ్‌లో భారీగా ప్రచారం చేసుకున్నది. దీంతో ఆశపడి సంప్రదించిన వారివద్ద ట్రైనింగ్ కోసం రూ.50 వేలు, గాడిదకు రూ. లక్ష, డిపాజిట్రూ.5 లక్షలు వసూలు చేసింది. ఇలా.. సుమారు రూ.100 కోట్లకు పైగా కాజేసింది. కొద్ది నెలలు గాడిద పాలు కొన్న తర్వాత ఆపెయ్యడంతో బాధితులు ప్రశ్నించారు. చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకున్న నిందితులు.. ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. తాము అన్యాయమై పోయామని, 18 నెలలుగా పోరాడుతున్నామని, అయినా న్యాయం జరగడం లేదని వాపోయారు.
తమిళనాడులోని తిరునల్వేలి కేంద్రంగా ‘డాంకీ ప్యాలెస్’ అనే సంస్థ ఆన్ లైన్ లో 2022లో గాడిద పాల బిజినెస్ మొదలుపెట్టింది. బాబు ఉలగనాథన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో గిరి సుందర్, బాలాజీ, సోనికా రెడ్డి, డాక్టర్ రమేశ్ టీమ్దందాను లీడ్ చేసేది. 2022 మే నెలలో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ విష్ణు వేణుగోపాల్, ఎన్ఆర్సీఈ మెంబర్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార సంస్థల డైరెక్టర్‌తో సంస్థ ఫామ్‌కు ప్రారంభోత్సవం చేశారు. దీన్ని వీడియో తీయించి యూట్యూబ్, ఇతర సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి తిరుపతికి చెందిన సోనికారెడ్డి ప్రమోట్ చేసింది. గిరిసుందర్ మార్కెటింగ్చేశాడు. బాలాజీ మార్కెటింగ్‌తో పాటు రైతుల దగ్గరకు వచ్చి పాలు కలెక్ట్ చేసుకుని వెళ్లేవాడు. రమేశ్‌కుమార్ తాను డాక్టర్‌ను అని పరిచయం చేసుకొని, ట్రైనింగ్ఇచ్చేవాడు. కొవిడ్ నేపథ్యంలో ఎక్కువ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందని, అందుకే డాంకీ మిల్క్ బిజినెస్లాభాలు తెచ్చిపెడుతుందంటూ తెగ ప్రచారం చేశారు. దీంతో జనాలు ఎగబడ్డారు.
రూ.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్
సెక్యూరిటీ డిపాజిట్ కింద రిఫండబుల్అమౌంట్అంటూ ఒక్కో రైతు దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నారు. మొదట గాడిదలు ఎక్కడ కొన్నా తమకు అభ్యంతరం లేదని చెప్పి.. తర్వాత తమ దగ్గర మేలు రకం గాడిదలు ఉంటాయని, తమ దగ్గరే కొనాలని కండీషన్పెట్టారు. 20 వేల వరకు దొరికే గాడిదలను రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు అంటగట్టారు. 75 శాతం మందికి ఇచ్చి.. మిగతా 25 శాతం మందికి గాడిదలు ఇవ్వలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు పెట్టుబడులు పెట్టగా, మొదట్లో లీటరు పాలను రూ.1600కు కొన్నారు. అమెరికా ఇతర రాష్ట్రాలకు పంపిస్తామని, చిన్న పిల్లలకు కూడా తాగిస్తారని, రాను రాను లీటర్ధర రూ.2 వేల వరకూ పోతుందని నమ్మబలికారు. ఫ్రాంచైజీ అంటూ మొదట కేవలం100 మందికి మాత్రమే ఇచ్చి ఆపేశారు. దీంతో డిమాండ్పెరిగింది. గాడిదలకు అనారోగ్యం చేసినా ట్రీట్మెంట్బాధ్యత తమదే అని, ఫుడ్ ఏం పెట్టాలి? పాలు ఎలా తీయాలి? అనేది ట్రైనింగ్ ఇస్తామని చెప్పి 2, 3 గంటల ట్రైనింగ్‌కు ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు తీసుకున్నారు. ఏపీలోని కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, తెలంగాణలోని హైదరాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, కోదాడ, మిర్యాలగూడ, సిద్దిపేటకు తమిళనాడు నుంచి ప్రత్యేక వెహికల్పంపించి, పాలను సేకరించేవారు. ఇలా తెలంగాణలో 100 మంది, ఆంధ్ర, తమిళనాడులో 250 మంది, కర్నాటకలో 13 మంది వరకు ఈ బిజినెస్‌లో చేరారు. అగ్రిమెంట్ సందర్భంగా నకిలీ జీఎస్టీ నంబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు ఇచ్చారు. ఇలా 2024 జనవరి వరకు పాలను కొన్న ఈ టీమ్ తర్వాత నుంచి చేతులెత్తేసింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అనంతరం వాట్సాప్ గ్రూప్పెట్టి డబ్బులు అరేంజ్ చేస్తున్నామని, మీడియా వద్దకు వెళ్లొద్దని మెసేజ్‌లతో మభ్యపెట్టింది. తర్వాత వారి దగ్గరకు వెళ్లిన కొంతమందికి చెక్కులిచ్చారు. అవి బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. అడిగితే బెదిరించడం మొదలుపెట్టారు. చివరకు మెయింటెనెన్స్ లేక ఇచ్చిన గాడిదలు చనిపోయే స్థితికి చేరుకున్నాయి. చెన్నై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు. అలాగే, కర్నాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ చాలామంది బాధితులు ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో ప్రెస్మీట్లు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. ఇదో పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి, తమను ముంచిన కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతున్నారు. లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారు.
56 లక్షలు పెట్టి 65 గాడిదలతో ఫామ్
లీటర్ గాడిద పాలకు రూ. 1600 ఇస్తామనడంతో చాలామంది ఐదారు గాడిదలు కూడా కొన్నారు. ఇందుకోసం కొంతమంది గ్రూపులుగా ఏర్పడి పెట్టుబడులు పెట్టారు. బెంగళూరులో జాబ్ చేసే సాయిబాబు అనే వ్యక్తి కుప్పంకు చెందిన కొంతమందితో కలిసి రూ.56 లక్షల పెట్టుబడి పెట్టారు. ఇందులో సాయిబాబు ఒక్కడే రూ.25 లక్షలు చెల్లించాడు. ఇతడి దగ్గర 65 గాడిదలు ఉండగా, ఆరుగురు వర్కర్లను పెట్టి ఫామ్ రన్చేశాడు. వారికి భోజనం, జీతం, ఇతర సౌకర్యాలతోపాటు నెలకు రెండున్నర లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ఫామ్‌లో పాల నిల్వ కోసం ఫ్రీజర్ సిస్టమ్ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి 6 నెలలు నెలకు 300 లీటర్ల చొప్పున పాలు అమ్మగా డబ్బులు బాగానే ఇచ్చారు. తర్వాత డబ్బులివ్వడం ఆపెయ్యడంతో బెంగళూరులో జాబ్చేస్తే వస్తే జీతం నుంచి ఖర్చు పెట్టేవాడు. రేపు, మాపు కొంటారేమోనని ఎదురుచూసి చూసి మోసపోయానని తెలుసుకొని ఘొల్లుమన్నాడు. నిర్వాహకులు నిండా ముంచడంతో సాయిబాబు స్నేహితులు తినడానికి తిండి కూడా లేని స్థితికి చేరుకున్నారు. ఇందులో ఒకరి తమ్ముడు రూ. 40 వేలు కాలేజీ ఫీజు కట్టలేని స్థితిలో ఆత్మహత్యాయత్నం కూడా చేయడం గమనార్హం. ప్రస్తుతం అతడు తమిళనాడులోని ఓ దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.