దేశంలో పేదలు, పీడితులు, శ్రామిక, కార్మికవర్గాల పక్షాన నిలబడి.. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి నుంచి జాతీయస్థాయి దాకా పోరాటాలు చేయడంలో కమ్యూనిస్టులు ముందుంటారనేది తెలిసిన వాస్తవమే. పాలక ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలే పోరాట సిద్ధాంతంగా.. సామాన్యుల బతుకు కష్టాలే అజెండాగా చేసుకుని ఎర్రజెండాల నేతలు ఉద్యమాలు చేస్తారని ముద్రపడిపోయారు. పెట్టుబడిదారి, కార్పొరేట్, బూర్జువా వ్యవస్థలను కూడా తీవ్రంగా వ్యతిరేకించడంలోనూ కామ్రేడ్లు ముందుంటారనేది తెలిసిందే. అలాంటి కమ్యూనిస్టులకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గడ్డుకాలమే నడుస్తోంది. వారి భవిష్యత్ దశ దిశపైనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నారు.. మరికొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు ఎంతో కొంత పట్టున్నా.. దేశ పాలక పగ్గాలు చేజిక్కించుకునే పరిస్థితి మాత్రం ఊహిస్తే అదొక సాహసమే. ఇంతకూ కామ్రేడ్ల పంథా ఏంటీ? ప్రజా సమస్యలపై పోరాటాలేనా? లేక దేశ అధికార పీఠం ఎక్కడమా? అనే సందిగ్ధత స్థితి నెలకొంది. ఓట్లు.. సీట్లు.. పదవులే అనేంతగా చాలా రాజకీయాలు మారిపోయాయి. వందేండ్ల చరిత్ర కలిగిన కమ్యూని స్టులు దేశ పాలన పగ్గాలు అందుకోవడంలో ఎందుకో వెనకబడిపోయారు.
అధికారంలో ఉండిన పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోనూ అధికారం పోవడమే కాకుండా, ఆ రాష్ట్రల్లో కమ్యూనిస్టుల ఉనికే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ఎలాంటి సమస్యపై అయినా ధర్నా, బంద్, రాస్తారోకో వంటి నిరసనలకు కమ్యూనిస్టులు పిలుపునిస్తే సామాన్యులు తండోప తండాలుగా తరలివెళ్తారు. సభలు, సమావేశాలు సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్తుంటారు. కానీ.. కమ్యూనిస్టులకు పాలనా పగ్గాలు అందించేందుకు ఓట్లెందుకు వేయడం
లేదు? ఇది శేషప్రశ్ననే అవుతుంది.
‘ఐరోపాను ఒక కమ్యూనిస్టు భూతం వెంటాడు
తోంది’ అనే వ్యాఖ్యతో మొదలవుతుంది సామ్యవాద తత్వవేత్త కారల్ మార్క్స్ రాసిన ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’. ప్రస్తుత కాలంలో యూరప్ రాజకీయాల్లో కమ్యూనిజం ఏదశలో ఉందో తెలియదు. కానీ.. భారత్లో కమ్యూనిస్టు సిద్ధాంతం చీలికలు, పీలికలతో కొట్టుమిట్టాడుతోంది. నానాటికీ కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గుతోంది. దేశ స్వాతంత్య్రానికి పూర్వం.. తదనంతరం కమ్యూనిస్టులు రాజకీయాల్లో చారిత్రాత్మకమైన పాత్రను పోషించారు. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఎన్నో ప్రజా పోరాటాలకు, ఉద్యమాలకు పురుడుపోశారు. దేశ రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. కానీ, దశాబ్దాలుగా కమ్యూనిస్టు సిద్ధాంతం కొడిగడుతోంది. నేడు కమ్యూనిస్టులు లెఫ్టా.. రైటా అని తేల్చుకోలేని స్థితికి చేరిపోయారు. భవిష్యత్ దిశ దశ ఏంటో కూడా తెలియని అయోమయంలో పడిపోయారు.
యూపీలోని కాన్పూర్‌లో ఆవిర్భవించిన సీపీఐ
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)1925 డిసెంబర్, 26న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్‌లో తొలిసారిగా ఆవిర్భవించింది. 2024 డిసెంబర్ 26తో ఆ పార్టీకి వందేండ్లు నిండాయి. ఆ పార్టీ నేతలు శతాబ్ది వేడుకలను కూడా నల్గొండలో ఘనంగా నిర్వహించింది తెలిసిందే. గతకాలంలో పార్టీ ప్రాభవంపై ఎలాంటి ఆత్మావలోకనం చేసుకున్నారనేది వదిలేద్దాం. ఇక దేశంలో అత్యధిక ఓటుబ్యాంకు కలిగిన పేదలు, పీడితులు, శ్రామిక, కార్మికవర్గాల పక్షాన పోరాటాలు చేసే కమ్యూనిస్టులు.. అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నారు? వ్యూహాత్మ క రాజకీయాలు చేయడంలో వెనకబడ్డారా? ఏకం కాకపోవడమేనా? పాలన పగ్గాలు చేపట్టాలనే పంథా లేదా? కేవలం ప్రజా సమస్యలపై పోరాటాలే లక్ష్యమా? సరైన దిశలో కామ్రేడ్లను నడిపించే నాయకత్వం లోపించిందా? వృద్ధ నేతల సారథ్యంలోనే ఎర్రజెండా పార్టీలు ఇంకా నడుస్తుండడమా? యువతరం నేతలను ప్రోత్సహించకపోవడమా? రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు కోరుకోకపోవడమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కామ్రేడ్లు ఇలా..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి చూసుకుంటే.. లెఫ్టా.. రైటా.. ఇంతకూ కామ్రేడ్ల దారెటు? అన్నట్టుగానే ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పురుడుపోసింది. ఇంకెన్నో పోరాటాలు, ఉద్యమాలు నడిపారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటలుగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ పార్టీల పునాదులు కదిలిపోయాయి. దాదాపు ఎర్రకోటలకు బీటలు పడ్డాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ విజయం సాధించాల్సింది పోయి.. పార్టీ అస్తిత్వ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఎప్పటికప్పుడు తెర ముందైనా.. తెర వెనకైనా పొత్తులు పెట్టుకోవడం కొనసాగించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ దాకా ఇదే పంథా అనుసరించారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో అంటకాగుతున్నారనే విమర్శలు సామాన్యుల నుంచి లేకపోలేదు. నేడు తెలంగాణలో సీపీఐ ఒక సీటులో మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తోంది. అది కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే. ఏపీలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే సాహసం చేయలేదు. ఆ పార్టీలు కూడా పట్టించుకోలేదు. ఎప్పటికీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు కోసం వెంపర్లాడటం తప్పితే.. పార్టీల ప్రక్షాళనపై కామ్రేడ్లు దృష్టి పెట్టడంలేదు. ఏకమవుదామనే ఆలోచన చేసినా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పాతతరం మేధావివర్గ కమ్యూనిస్టులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇప్పుడు ఒకే తాటిపై నడిపించే నాయకులు కొరవడ్డారు. రాజకీయాలతోపాటు కాలానుగుణంగా మార్పును కోరుకుందామనే సోయిలోకి రావడం లేదనిపిస్తోంది. ఆ దిశగా ముందుకు నడుద్దామనే సాహసం కూడా చేయడంలేదనిపిస్తోంది.
గతమెంతో ఘన చరిత్ర
దేశ చరిత్రలో కమ్యూనిస్టులకు గతంలో ఎంత ఘన చరిత్ర ఉందో.. అంతేస్థాయిలో ఇపుడు విఫలం చరిత్ర రాసుకుంటున్నారనేది జనవాక్యం. స్వాతంత్య్రం తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ 1952లో 16 సీట్లు, 1957లో- 27 సీట్లు, 1962లో 29 స్థానాల్లో విజయం సాధించింది. 1964లో సీపీఐ, సీపీఎంగా రెండు వర్గాలుగా చీలిపోయారు. 2004లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కమ్యూనిస్టుల చరిత్రలోనే ఏకంగా 53 ఎంపీ సీట్లను గెలుపొందారు. 2024లో 6 సీట్లకు పడిపోయారు. జాతీయ పార్టీలనే గుర్తింపును కూడా కోల్పోయే దురవస్థ దాపురించింది. సీపీఐ జాతీయ పార్టీ హోదాను కూడా కోల్పోయింది. సీపీఎం కూడా అదే బాటలో నడుస్తోంది. పాత నీరు పోతుంటే.. కొత్త నీరు రావాలనే సిద్ధాంతాన్ని విడనాడడంతోనే దేశంలో లెఫ్టిజం పాలిపోతోంది. దీన్ని స్వయంకృతాపరాధం అనొచ్చేమో.! ఇది ముమ్మాటికీ నిష్టూరమైన వాస్తవమని చెప్పక తప్పుదు!. 60 ఏండ్లు అయినా కమ్యూనిస్టులు ఏకం కావడంలేదు. ఇప్పటికైనా తమ తప్పులెంటో తెలుసుకుని.. సరైన నాయకత్వంతో ఎదగకపోతే.. రాజకీయ వ్యూహాలు పాటించకపోతే.. మూస ధోరణిలో వెళితే.. త్వరలోనే కమ్యూనిస్టులు కనీసం ప్రజాప్రతినిధులుగా నైనా కనిపించరేమో!
ఉనికి కోసం కమ్యూనిస్టుల పోరాటం
ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్‌కు దీటుగా ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు నిలిచారు. 1964 తర్వాత చీలికలు పీలికలు అయ్యారు. ఇప్పుడు ఉనికికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేరళ.. పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టారు. నందిగ్రామ్, మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాత్మక దెబ్బలకు సీపీఎం కుదేలైంది. అక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. త్రిపురలోనూ ఓటమి చెందింది. ఇక్కడ కూడా బీజేపీ ఆక్రమించేసింది. నేడు కేరళకు మాత్రమే పరిమితమైంది. 1962లో భారత్ – చైనాల మధ్య యుద్ధానంతరం సీపీఐ నేతల మధ్య సిద్ధాంత విభేదాల అనంతరం రెండేండ్లకే సీపీఎం ఆవిర్భవించింది. దీంతో రెండు వర్గాలుగా చీలారు. కాలాక్రమేణా వాటిలో మరికొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. దేశంలో తొలిసారిగా కమ్యూనిస్టులు1957లో సీపీఐ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి కామ్రేడ్లు ప్రస్తుతం ఐక్యత లేమితో కొట్టుమిట్టాడుతున్నారనేది తెలిసిన నిజం. స్వీయ అస్తిత్వ సిద్ధాంతం మీద ఎదగలేకపోతున్నారా? లేదా కాలానుగుణమైన ఆలోచనా విధానాలను అవలంబించలేకపోతున్నారా?
- వేల్పుల సురేశ్
సీనియర్ జర్నలిస్ట్