- మునుగోడు తరహా వ్యూహం అనుసరిస్తున్న బీఆర్ఎస్
- ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక కన్వీనర్, కో కన్వీనర్
- నియోజకవర్గం, గ్రామాల వారీగా మేనిఫెస్టోలు
- అసంతృప్తులు, ఉద్యమకారులతో భేటీలు
- క్యాడర్, ప్రజలకు దగ్గరయ్యేలా ప్లాన్లు
- కామారెడ్డిలో ఇప్పటికే షురూ.. మిగిలిన చోట్ల అమలుకు ఏర్పాట్లు
కామారెడ్డి/నల్గొండ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ పెరగడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. కాంగ్రెస్ ముందంజలో ఉందని పలు సర్వేల్లో తేలడం, ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా ఇదే విషయం చెప్తుండడంతో జాగ్రత్త చర్యలు చేపట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో, క్యాడర్‌లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయా వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో మునుగోడు తరహా వ్యూహాన్ని అనుసరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది. సీఎం పోటీ చేయనున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే ఈ ప్లాన్ అమల్లోకి వచ్చింది. త్వరలో మిగతా నియోజకవర్గాల్లోనూ ఇలానే చేయాలని నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కామారెడ్డితో మొదలు
మొదటి దశలో నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమించగా, ప్రస్తుతం బూత్‌ల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తున్నారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని పెడ్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌పరిధిలో ఒక కన్వీనర్, కో కన్వీనర్‌ను నియమిస్తున్నారు. ప్రతి ఊరికి, వార్డుకు ఇన్చార్జిని వేస్తున్నారు. నియోజక వర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య లీడర్లను కూడా బూత్ కన్వీనర్, గ్రామ ఇన్చార్జి, వార్డు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. సీఎం పోటీ చేయబోయే కామారెడ్డిలో ఇప్పటికే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జిలుగా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 45 వేల 822 మంది ఓటర్లు ఉన్నారు.
ప్రతి 100 మందికి ఒకరి చొప్పున 2,458 మంది ఇన్చార్జిల నియామకం పూర్తయింది. 266 పోలింగ్ బూత్‌లు ఉండగా.. ఒక్కో బూత్‌కు కన్వీనర్, కో కన్వీనర్‌ను ప్రకటించారు. ఓటర్ల ఇన్చార్జి, బూత్‌కన్వీనర్, కో కన్వీనర్లను కోఆర్డినేట్ చేసేందుకు ఊరు/ టౌన్లలో వార్డుకు ఒక ఇన్చార్జి చొప్పున బాధ్యతల్ని అప్పగించారు. ఒక్కో ఇన్చార్జి 100 మంది ఓటర్లతో నిత్యం టచ్‌లో ఉంటూ వాళ్ల సమస్యలు తీర్చడంతో పాటు ఎన్నికల్లో ఓటు వేయించేదాకా పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్తున్నారు. మిగిలిన నియోజనకవర్గాల్లో దసరా తర్వాత కన్వీనర్లు, ఇన్చార్జిల నియామకం పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు.
గ్రామాలవారీగా మీటింగులు
సీఎం కేసీఆర్ ఆదివారం బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించగా, నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రెడీ చేసుకోవాలని క్యాండిడేట్లను ఇప్పటికే హైకమాండ్ ఆదేశించింది. ఇటీవల కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలో కామారెడ్డికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని, గ్రామాలు, వార్డుల వారీగా మేనిఫెస్టోలు తయారు చేయాలని లీడర్లకు సూచించారు.
దీంతో అభ్యర్థులందరూ నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో మేనిఫెస్టోలు రూపొందించే పనిలో తలమునకలయ్యారు. తాము గెలిస్తే ఐదేండ్లలో నియోజకవర్గానికి ఏమిచేయనున్నామనేది అందులో తెలియజేస్తారని తెలుస్తున్నది. గ్రామం, టౌన్ల వారీగా కూడా ప్రత్యేక మేనిఫెస్టోలు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాలవారీగా మీటింగులు పెడ్తున్నారు. ప్రతి మండలంలో రోజుకు 15 గ్రామాల చొప్పున ముఖ్యకార్యకర్తలను నియోజకవర్గ కేంద్రాలకు రప్పించి మీటింగులు పెట్టి, పెండింగ్‌లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి ఆధారంగా మేనిఫెస్టోలు రెడీ చేస్తున్నారు. వీటిని ఆయా గ్రామాలకు చెందిన సోషల్ మీడియాలలో వైరల్ చేయాలని భావిస్తున్నారు.
తటస్థులను యాక్టివ్ చేసేలా..
ఇగోలను పక్కనపెట్టి అసంతృప్తులతో మాట్లాడాలని, ఉద్యమకారులను కలుపుకుపోవాలని కేసీఆర్, కేటీఆర్ సూచించడంతో బీఆర్ఎస్ అభ్యర్థుంతా ఆయా వర్గాలతో భేటీలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ పోరాటంలో భాగంగా పార్టీతో కలిసి ఉద్యమించిన పలువురు నేతలు తర్వాతి కాలంలో దూరమయ్యారు. ఈక్రమంలో పలువురు ఇతర పార్టీల్లో చేరగా, కొందరు తటస్థంగా ఉండిపోయారు. అలాంటి ఉద్యమకారులందరితో సమావేశమై, వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా హామీలు ఇవ్వాలని, వారిని తిరిగి పార్టీలో యాక్టివ్ చేయాలని క్యాండిడేట్లు భావిస్తున్నారు.