
న్యూఢిల్లీ: పది మందిలోనే ఉంటారు.. కానీ, ఎప్పుడూ లోన్లీగానే ఫీలవుతుంటారు. బతకడం దండగ అనే భావనలోనే మునిగితేలుతుంటారు. గత కొంతకాలంగా మన దేశంలోని విద్యార్థుల్లో కనిపిస్తున్న ఆందోళనకర పరిస్థితి ఇది. పది మంది స్టూడెంట్లలో ఒకరు ఆత్మహత్య ఆలోచనల చుట్టూ తిరుగుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. మెల్బోర్న్యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ఆఫ్ మెంటల్హెల్త్అండ్న్యూరో సైన్సెస్, పలు ఇండియన్మెడికల్ కాలేజీ సంయుక్తంగా మన దేశంలోని యూనివర్సిటీల్లో సర్వే చేపట్టాయి.
తొమ్మిది రాష్ట్రాల్లోని 30 వర్సిటీలకు చెందిన 8,542 మంది స్టూడెంట్ల ప్రవర్తనను స్టడీ చేశాయి. ఇందులో పలు భయంకర విషయాలు వెలుగుచూశాయి. ప్రతి 10 మంది స్టూడెంట్లలో ఒకరు ఆత్మహత్య ఆలోచనలు చేసినట్లు సర్వే గుర్తించింది. 12 శాతం మంది స్టూడెంట్లు ఏడాదిలో ఆత్మహత్య ఆలోచనలు చేయగా.. 5శాతం మంది ఆత్మహత్యయత్నాలు కూడా చేసినట్లు వెల్లడైంది. 40 మంది విద్యార్థులున్న క్లాస్‌రూమ్‌లో నలుగురు జీవితంపై ఆశలు కోల్పోయారని, ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారని స్టడీ పేర్కొంది. ఐఐటీ, నిట్, ఐఐఎం స్టూడెంట్లలోనూ సూసైడ్ టెండెన్సీ ఎక్కువగా ఉందని తెలిపింది. పరీక్షల ఒత్తిడి, కుటుంబ సంబంధాలు సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంది.