పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎయిర్ గన్ తో కాల్పులు జరపడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని పాత పాల్వంచకు చెందిన ఎండీ సిరాజ్ అక్కను కొన్నాళ్ల కింద తిరుమలాయపాలెంకు చెందిన షేక్ జిలానికి ఇచ్చి వివాహం చేశారు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో సిరాజ్ అక్కను పాత పాల్వంచ తీసుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో గురువారం అతిగా మద్యం సేవించి ఎయిర్ గన్ తో వచ్చిన జిలాని సిరాజ్ తో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో జిలాని ఎయిర్ గన్ తో కాల్పులు జరపడంతో సిరాజ్ తొడకు గాయమైంది. సిరాజ్ స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా శనివారం కేసు నమోదైంది. తిరుమలయపాలెంలోని జిలానిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్సై సుమన్ తెలిపారు.