
బెంగళూరులోని అనేకల్ లో నిర్వహిస్తున్న ఓ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. శనివారం ( మార్చి 23 ) అనేకల్ లోని హుసుర్ మడ్డురమ్మ గుడి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఊరేగింపులో 120 అడుగుల రథం కుప్పకూలింది.ఈ కోలాహలంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో చుట్టుపక్కల 10 గ్రామాల జనం పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ వేలాది మంది భక్తులున్నారు. రథాన్ని తాళ్లతో కట్టి పైకి లేపడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పిన రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎత్తైన రథాల ఊరేగింపునకు హుసుర్ మడ్డురమ్మ ఆలయం ప్రసిద్ధి చెందింది. పదేళ్ల క్రితం వరకు ఈ వేడుకల్లో వందల రథాలు ఉరేగించేవారని.. ప్రస్తుతం రథాల సంఖ్య 10కి చేరిందని తెలుస్తోంది.