ఖమ్మం మార్కెట్​కు లక్ష బస్తాల మిర్చి..ఈ సీజన్​లోనే అత్యధికం

ఖమ్మం మార్కెట్​కు లక్ష బస్తాల మిర్చి..ఈ సీజన్​లోనే అత్యధికం
  • తేజా రకం క్వింటా జెండా పాట రూ.14 వేలు
  • క్వింటా రూ.6 వేల వరకు తగ్గించి కొనుగోలు చేసిన వ్యాపారులు
  • వరంగల్​ ఎనుమాముల మార్కెట్​కూ పోటెత్తిన మిర్చి
  • గిట్టుబాటు ధర దక్కక రైతుల్లో ఆందోళన

ఖమ్మం/ ఖమ్మం టౌన్/ వరంగల్ సిటీ, వెలుగు:  ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మిర్చి పోటెత్తింది. ఈ సీజన్​లోనే అత్యధికంగా సోమవారం ఏకంగా లక్ష బస్తాలకు పైగా మిర్చిని రైతులు తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని పలు జిల్లాల నుంచి  రైతులు పంటను అమ్మేందుకు తెచ్చారు. వరుసగా 2 రోజుల సెలవుల తర్వాత మార్కెట్ ప్రారంభం కావడంతో భారీగా మిర్చి బస్తాలు వచ్చాయి. మార్కెట్ యార్డు మొత్తం నిండిపోగా, రేటు విషయంలో మరోసారి రైతులకు నిరాశే ఎదురైంది. సోమవారం క్వింటాల్​ మిర్చి  జెండా పాట రూ.14 వేలు పలకగా, ఒకట్రెండు లాట్లను మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేశారు. మోడల్ ధర రూ.13,300 నమోదు కాగా, మిగిలిన రైతుల దగ్గర రూ.6 వేల చొప్పున కూడా కొనుగోలు చేశారు. దీంతో తమకు పెట్టుబడి, ఇతర కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎక్కువ రేటు కొందరికే!

మిర్చి రేటు విషయంలో తమకు ప్రతిసారి అన్యాయ జరుగుతున్నదని రైతులు వాపోతున్నారు.  మూడేండ్ల క్రితం క్వింటా రూ.25 వేల వరకు పలికిన తేజా రకం మిర్చి ధర, ఇప్పుడు అందులో సగానికి పడిపోయిందని, మార్కెటింగ్ శాఖ అధికారులు జెండా పాట రేటును గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా, ఆ రేటు ఒకరిద్దరికి మాత్రమే దక్కుతున్నదని చెబుతున్నారు. కలర్​ తక్కువగా ఉందని, క్వాలిటీ లేదని కొర్రీలు పెడుతూ వ్యాపారులు రేటు తగ్గించేస్తున్నారని అంటున్నారు. ముందుగా చెప్పిన రేటును కూడా తగ్గించి, కాంటాలు అయ్యే సమయంలో క్వింటాకు రూ.300 వరకు కోత పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో రూ.8 వేలకు, చివరకు రూ.6 వేల ధరకు కూడా మిర్చిని  అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా డిమాండ్​ లేకపోవడం, ఎక్స్​ పోర్ట్ ఆర్డర్లు రాకపోవడం వల్ల రేటు తగ్గుతున్నదని వ్యాపారులు చెబుతున్నారు. 

తెగుళ్లతో దిగుబడిపై ఎఫెక్ట్!

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనే తేజా రకం మిర్చిని రైతులు సాగు చేస్తారు. ఘాటు ఎక్కువగా ఉండడంతో ఈ రకానికి విదేశాల్లో మస్తు డిమాండ్ ఉంటుంది. గతంలో ఇక్కడి నుంచి థాయ్​ లాండ్​, బంగ్లాదేశ్​, మలేషియా, చైనా, సింగపూర్​ లాంటి దేశాలకు మిర్చి ఎగుమతి అయ్యేది. ఈ సారి ఆ పరిస్థితి లేదు. తోటలు వేసే సమయంలో విపరీతమైన ఎండల కారణంగా పెద్ద ఎత్తున మొక్కలు చనిపోయాయి. మళ్లీ నాటుకోవాల్సి రావడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. నిరుడు సెప్టెంబర్​లో కురిసిన వర్షాలు, వరదల కారణంగా ఎక్కువ రోజులు తోటల్లో నీరు నిలిచి ఉండి మొక్కలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత గుబ్బ తెగులు, కొమ్మ కుళ్లు తెగులు, వేరు కుళ్లు తెగులు ఆశించాయి. దీంతో మిర్చి దిగుబడి కూడా బాగా పడిపోయిందని, ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం చూస్తే ఈ ఏడాది కూలీ ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. తమకు గిట్టుబాటు ధర దక్కేలా మార్కెట్ పాలకవర్గం, అధికారులు చొరవ తీసుకోవాలని  కోరుతున్నారు. 

ఎనుమాములకూ రికార్డు స్థాయిలో..

 వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కూ రికార్డు స్థాయిలో మిర్చి వచ్చింది. శని, ఆదివారాలు మార్కెట్​కు సెలవు కావడంతో సోమవారం రైతులు మార్కెట్​కు భారీ ఎత్తున మిర్చి బస్తాలను తీసుకువచ్చారు.  ఒక్కరోజే సుమారు 45వేల మిర్చి బస్తాలు మార్కెట్​కు వచ్చినట్టు  అధికారులు తెలిపారు.  భారీగా మిర్చి రావడంతో వ్యాపారులు రేట్లు తగ్గించారు. క్వింటాల్​కు 10వేల నుంచి  15వేల ధర మాత్రమే పడిందని రైతులు తెలిపారు. 

నల్లి బాధతో నష్టం 

మిర్చి పంటకు నల్లి సోకడంతో తీవ్రంగా నష్టపోయాం. ఎకరానికి 10 క్వింటాళ్లు కూడా దిగుబడి రావడం లేదు. చేతికి వచ్చిన పంటను మార్కెట్ కు తెస్తే ధర లేదు. కాంటాలు వేసే సమయంలో కూడా కొర్రీలు పెట్టి రేటు తగ్గిస్తున్నారు. ఇన్ని నష్టాల మధ్య పంట ఎలా పండించేది. పంట అమ్మగా వచ్చిన డబ్బులు కూలీల ఖర్చులకు కూడా సరిపోయేలా లేవు. 
 -ఇస్లావత్ శంకర్, మరిపెడ బంగ్లా (ఖమ్మం)

పెట్టుబడి పెరిగింది.. రేటు తగ్గింది 

మిర్చి పంటకు ఈసారి రోగాలు ఎక్కువ రావడం వల్ల హై క్వాలిటీతో మందులను వాడాం. దీంతో పెట్టుబడి ఖర్చు బాగా పెరిగింది. పంట చేతికి వచ్చినప్పటికీ ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. క్వింటా రూ.12,200 చొప్పున 20 బస్తాలు అమ్మా. సొంత భూమిలో సాగు చేసుకున్న వారికి మార్కెట్ ఇచ్చే ధర ఊరట కలిగిస్తున్నది.. కానీ మాలాంటి కౌలు రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాం. 
-గుగులోతు సీతారాములు,  
హైదర్ సాయిపేట (ఖమ్మం)