ఎమ్మెల్యేల చేతుల్లోనే రూ.లక్ష బీసీ లోన్‍.. గృహలక్ష్మి స్కీం ఎంపిక చూసేది కూడా లీడర్లే

ఎమ్మెల్యేల చేతుల్లోనే  రూ.లక్ష బీసీ లోన్‍.. గృహలక్ష్మి స్కీం ఎంపిక చూసేది కూడా లీడర్లే
  • ఆన్‍లైన్‍ అప్లికేషన్‍, ఆఫీసర్ల ఎంక్వైరీ నామ్‍కే వాస్తే 
  • మండలాల నుంచి లిస్టు తెప్పించుకుంటున్న ఎమ్మెల్యేలు
  • ముఖ్య నేతల సంతకంఉన్నవాటికే ఆఫీసర్ల ప్రాధాన్యత
  • బీసీ లోన్‍ కు రూ.15 వేలు, గృహలక్ష్మికి రూ.40 వేల కమీషన్‍ 
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్‍ పార్టీకి ఓటేసేలా ముందస్తు కండిషన్​

 

వరంగల్‍/మెదక్‍, వెలుగు:  బీసీ కులవృత్తుల వారికి ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సాయం, ఇల్లు లేని పేదలు సొంతింటి జాగాలో ఇండ్లు కట్టుకునేందుకు ఇచ్చే రూ.3 లక్షల గృహలక్ష్మి స్కీం లబ్ధిదారుల ఎంపిక మళ్లీ ఎమ్మెల్యే చేతుల్లోకే వెళ్లిపోయింది. ఆన్‍లైన్‍ అప్లికేషన్‍ ప్రాసెస్‍, అత్యంత వెనుకబడ్డవారికి మొదటి ప్రాధాన్యత, ఎంక్వైరీ ఆధారంగా అర్హుల ఎంపిక ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ, దళితబంధు స్కీం లెక్కనే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆ స్థాయి లీడర్లు ఇచ్చే లిస్టులో పేర్లు ఉన్నవారికే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది నిజమన్నట్లుగా అధికార పార్టీకి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు గ్రామాల్లో బీసీ లోన్ల పేరుతో లిస్టులు తయారు చేసి ముఖ్య లీడర్లకు పంపిస్తున్నారు. లోన్‍ ఇవ్వాలంటే కమీషన్​తో పాటు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేసేలా  కండిషన్లు పెడుతున్నట్టు సమాచారం. 

రెండు వారాల్లోనే.. 4.5 లక్షల అప్లికేషన్లు 

రాష్ట్ర ప్రభుత్వం బీసీ లోన్లు ఇచ్చే క్రమంలో ఆన్‍లైన్‍ ద్వారా అప్లై చేసుకోడానికి జూన్‍ 6న నుంచి 20 వరకు అవకాశం ఇచ్చింది. కేవలం రెండు వారాలే గడువు ఇవ్వడంతో లబ్ధిదారులు కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం తహసీల్దార్‍ ఆఫీసుల చుట్టూ తిరిగారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో సర్కారు జూన్‍ 22 వరకు రోజూ ఏదో ఓ కార్యక్రమం నిర్వహించడంతో అధికారులు ఆ పనుల్లో ఉండి ఆఫీసుల్లో అందుబాటులో లేకుండా పోయారు. దీనికి తోడు నెట్​వర్క్​ ప్రాబ్లంతో సర్వర్‍ పని చేయలేదు. దీంతో లక్షలాది మందికి కుల, ఆదాయ సర్టిఫికెట్లు అందలేదు. అయినా, అంత తక్కువ సమయంలోనూ దాదాపు 4 లక్షల 50 వేలకు పైచిలుకు లబ్ధిదారులు ఆన్‍లైన్‍ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.  

ఒక్కో నియోజకవర్గంలో 300 మందికే..

బీసీలకు లక్ష లోన్లు ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ రూ.400 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన ఏటా 40 వేల మందికి ఇవి దక్కనున్నాయి. లిస్టుల ఆధారంగా ఎంపిక చేసిన తర్వాత జూలై 15 నుంచి అర్హులకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్‍ ప్రకటించారు. కాగా, మొదటి దశలో ప్రాధాన్యత క్రమంలో ఒక్కో నియోజకవర్గానికి 330 మందికి ఈ స్కీం దక్కాల్సి ఉండగా.. పెద్ద లీడర్ల ఇలాకాల్లో ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి.. సగటున నియోజకవర్గానికి 300 మందికి అవకాశం దక్కనుంది. 

ఎమ్మెల్యే చేతుల్లోనే లిస్టులు  

బీసీ లోన్ల ఎంపిక పారదర్శకంగా చేస్తామనే పేరుతో ఈసారి ఆన్‍లైన్‍ పద్ధతిలో అప్లికేషన్లు తీసుకున్నారు. క్యాస్ట్​, ఇన్‍కమ్‍ సర్టిఫికెట్లు కూడా అడిగారు. అత్యధిక వెనుకబడ్డవారికి ఎంక్వైరీ ఆధారంగా మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.  ఇదంతా ఉత్త ముచ్చటే అని స్పష్టమవుతోంది. అప్పట్లో దళితబంధు పథకంలో జరిగినట్టే బీసీ లోన్ల ఎంపిక కూడా అనధికారికంగా మళ్లీ ఎమ్మెల్యేల చేతికే వెళ్లినట్టు అర్థమవుతోంది. మండలాల పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచుల ద్వారా ఎమ్మెల్యేలు గ్రామాలవారీగా తమకు అనుకూలంగా పనిచేసేవారి పేర్లు తెప్పించుకుంటున్నారు. అధికారుల వద్దకు వచ్చిన పేర్లతో సంబంధం లేకుండా..ఎమ్మెల్యేలు సెలక్ట్​ చేసిన లిస్టునే ఆఫీసర్లకు పంపిస్తున్నారు. రాజకీయ జోక్యం, ఒత్తిడిలో ఆఫీసర్లు కూడా ముఖ్య లీడర్లు చెప్పిన వారికే లోన్లు కేటాయిస్తున్నారు. 

గుట్టుచప్పుడు కాకుండా ‘గృహలక్ష్మి’ ఎంపిక

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డబుల్‍ బెడ్‍రూం ఇండ్ల స్కీం అట్టర్‍ ఫ్లాఫ్‍ కావడంతో సర్కారు పెద్దలు దాని స్థానంలో గృహలక్ష్మి స్కీం తీసుకువచ్చారు. నియోజకవర్గాల్లో ఇల్లులేని నిరుపేదలకు సొంత జాగా ఉంటే అందులో ఇండ్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి స్కీం తెచ్చామని, అందులో భాగంగా రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు చెప్పారు. దీనికోసం గైడ్​లైన్స్​ కూడా రూపొందించారు. దరఖాస్తులు మాత్రం తీసుకోవడ లేదు.  ప్రతి నియోజకవర్గంలో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‍ అమలు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో పథకం అమలు చేస్తామన్నారు. తీరా చూస్తే ఈ స్కీం కూడా ఎమ్మెల్యేల చేతికే వెళ్లినట్టు సమాచారం. గ్రామ స్థాయిని బట్టి ఒక్కో గ్రామానికి 10 నుంచి 30 వరకు ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉండడంతో చాలాచోట్ల ఎమ్మెల్యేలు తమ పార్టీ ప్రజాప్రతినిధులను ముందుపెట్టి లిస్టులు రెడీ చేయిస్తున్నారు. మెదక్‍ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలోని గ్రామ పంచాయతీ ఆఫీసులో ఆదివారం బీఆర్‍ఎస్‍ లీడర్లు గృహలక్ష్మి స్కీం లిస్టు తయారు చేస్తుండడంతో గ్రామస్తులు అభ్యంతరం చెప్పడమే దీనికి నిదర్శనం. 

ALSO READ :బ్యాంకుల వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో డీఐసీజీసీ లోగో

కమీషన్‍ ఇయ్యాలే.. కారు గుర్తుకు ఓటెయ్యాలే

అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుండడంతో రూ.లక్ష బీసీ లోన్‍, రూ.3 లక్షల గృహలక్ష్మి పథకాలతో ఓట్లు కొల్లగొట్టాలని బీఆర్ఎస్​ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే అర్హుల లిస్టులను ఫైనల్‍ చేస్తుండగా వీరికి మండల స్థాయి లీడర్లు సహకరిస్తున్నారు. దీంతో సదరు మండల లీడర్లు లక్ష రూపాయల బీసీ లోన్‍ ఇప్పించేందుకు రూ.15 వేల వరకు కమీషన్‍ అడుగుతున్నట్లు తెలుస్తోంది. రూ.3 లక్షల గృహలక్ష్మి పథకం కావాలంటే రూ.40 వేలు అడుగుతున్నట్లు చెబుతున్నారు. ఇవేగాక వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‍ ఎన్నికల్లో పక్కగా బీఆర్‍ఎస్‍ పార్టీకే ఓటేసేలా ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారని సమాచారం. నియోజకవర్గాల వారీగా రెండు పథకాలు తక్కువ మందికే దక్కే అవకాశం ఉండడంతో లబ్ధిదారులు లీడర్ల షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. మొత్తంగా దళితబంధు స్కీం లెక్కనే.. బీసీ లోన్‍, గృహలక్ష్మి పథకం కూడా పక్కదారి పడుతున్నాయి. 

గృహలక్ష్మి పథకానికి అనర్హుల పేర్లు రాస్తున్నారని ఆందోళన

రామాయంపేట : గృహలక్ష్మి పథకానికి అనర్హుల పేర్లతో లిస్ట్ తయారు చేస్తున్నారని మెదక్​ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇచ్చే గృహలక్ష్మి పథకాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. స్కీంకు సంబంధించిన గైడ్​లైన్స్​ ఇటీవలే రాగా, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. కానీ, కాట్రియాలలో బీఆర్ఎస్​ లీడర్లు రెండు రోజులుగా అర్హుల లిస్ట్ తయారు చేస్తున్నారు. ఆదివారం పంచాయతీ ఆఫీస్ లో లిస్ట్ రాస్తుండగా అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తల పేర్లతో లిస్ట్ తయారు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సర్పంచ్​ శ్యామ్​ మాట్లాడుతూ అర్హులందరికీ గృహలక్ష్మి పథకం అందేలా లిస్ట్ తయారు చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. 

వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో శనివారం బీసీ లోన్ల కోసం పేర్లు ఎంపిక చేసే విషయంలో ఎంపీపీ, వైస్‍ ఎంపీపీ తన్నుకున్నారు. గ్రామాలవారీగా బీసీ లోన్ల లిస్టును ఎమ్మెల్యే ఫైనల్‍ చేస్తుండడంతో ఎంపీపీ బాదావత్‍ విజేందర్‍, వైస్​ ఎంపీపీ కంది కృష్టారెడ్డి వారికి నచ్చిన పేర్లు రాసిచ్చారు. జల్లి గ్రామంలో ముగ్గురి పేర్లను లిస్టులో చేర్చే క్రమంలో ఇద్దరి మధ్య తేడాలు వచ్చి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి సమక్షంలోనే గొడవకు దిగారు. పక్కనే ఉన్న కాన్ఫరెన్స్​ హాలులో కొట్టుకున్నారు. కొద్దిసేపటికే ఈ సమస్యకు ఎంపీపీనే కారణం అంటూ పార్టీ నుంచి సస్పెండ్‍ చేశారు. ఎంపీపీ పదవి నుంచి తొలగించేందుకు అవిశ్వాస తీర్మాన నోటీసులను అధికారులకు అందజేశారు. ఈ ఘటనతో బీసీ లోన్ల ఎంపిక వ్యవహారం అంతా ఎమ్మెల్యేల క్యాంప్‍ ఆఫీసుల్లోనే జరుగుతుందనే సమాచారం బయటకు వచ్చింది.