- రూ. 2.7 నుంచి రూ. 44.60 కి పెరిగిన టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర
- ఏకంగా 1,521 శాతం లాభపడిన కంపెనీ షేరు
- మే 25 నుంచి వరసగా 27 సెషన్లలో అప్పర్ సర్క్యూట్
న్యూఢిల్లీ: కేవలం ఎనిమిది నెలల్లోనే ఒక షేరు ఏకంగా 1,521 శాతం పెరిగింది. అంటే కిందటేడాది అక్టోబర్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి, ప్రస్తుతం రూ. 15 లక్షలు రిటర్న్ వచ్చిందన్న మాట. ఆ కంపెనీనే టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర (టీటీఎంఎల్). నష్టాలు, అప్పులతో కూరుకుపోయిన కంపెనీ దశ ఒక్కసారిగా తిరిగింది. కంపెనీ ప్రమోటర్ అయిన టాటా సన్స్ టీటీఎంఎల్ రూపు రేఖలను మార్చాలని ప్లాన్స్ వేస్తోంది. దీంతో కిందటేడాది అక్టోబర్ 15 న రూ. 2.70 వద్ద ఆల్‌టైమ్ కనిష్టాన్ని టచ్ చేసిన ఈ షేరు, జూన్ 30 న రూ. 44.60 వద్ద ఆల్‌టైమ్ హైని టచ్ చేసింది. ఈ ఏడాది మే 25 నుంచి చూస్తే, కంపెనీ షేరు వరసగా 27 సెషన్లలో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇదే టైమ్‌లో టీటీఎంఎల్ షేరు 261 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 461 శాతం ఎగిసింది.
కంపెనీ రూపు మారుతోంది..
టాటా టెలీసర్వీసెస్ (మహారాష్ట్ర) క్వార్టర్లీ రిజల్ట్స్‌ను 2009 నుంచి గమనిస్తే, కేవలం రెండు క్వార్టర్లలోనే కంపెనీకి లాభాలొచ్చాయి. 2016, జూన్ క్వార్టర్‌లో ఒకసారి, 2019, మార్చి క్వార్టర్‌లో ఒకసారి ప్రాఫిట్స్‌ను ప్రకటించింది. మొత్తం 49 క్వార్టర్లలో 47 సార్లు కంపెనీకి నష్టాలే వచ్చాయి. ఈ ఏడాది మార్చి నాటికి టాటా టెలీ అప్పులు రూ. 17,774.47 కోట్లుగా ఉన్నాయని క్యాపిటల్ లైన్ పేర్కొంది. అంటే ఈ కంపెనీ ఎంత ఇబ్బందుల్లో ఉందో తెలుస్తోంది. కానీ, బలమైన ప్రమోటర్ ఉండడం కంపెనీకి కలిసొచ్చింది. టాటా టెలీసర్వీసెస్ అవతారాన్ని మార్చాలని టాటా సన్స్ నిర్ణయించుకుంది. ఈ కంపెనీని టాటా టెలీ బిజినెస్ సర్వీసెస్ (టీటీబీఎస్) గా మార్చి, స్మాల్, మీడియం బిజినెస్‌ల(ఎస్‌ఎంఈల) కు సర్వీసెస్‌ను అందించే కంపెనీగా తీర్చి దిద్దాలని చూస్తోంది. టీటీబీఎస్ తాజాగా స్మార్ట్‌ఫ్లో పేరుతో ఓ క్లౌడ్ ప్లాట్‌పామ్‌ను లాంచ్ చేసింది. వర్క్ ఫ్రమ్ హోం, ఆఫీస్ వర్క్ రెండింటిని ప్రమోట్ చేస్తున్న ఎస్‌ఎంఈలను కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. స్మార్ట్‌ఫ్లోను డెస్క్‌టాప్ ద్వారా, మొబైల్ ఫోన్‌లోనూ యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది. మరోవైపు టాటా గ్రూప్ త్వరలో తీసుకురానున్న సూపర్ యాప్‌కు టెక్నికల్ సపోర్ట్‌ను ఇచ్చేందుకు టాటా టెలీసర్వీసెస్‌ను వాడనున్నారని వార్తలొచ్చాయి. సూపర్ యాప్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో టాటా గ్రూప్ ఆఫర్ చేస్తున్న వివిధ ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. టాటా సన్స్ ఇస్తున్న సపోర్ట్‌ను బట్టి, టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్రకి వచ్చే 12 నెలల వరకు ఎటువంటి లిక్విడిటీ సమస్య ఉండదని తెలుస్తోందని కేర్ రేటింగ్స్ అంచనావేసింది. కాగా, 2019 లో కన్జూమర్ బిజినెస్‌ను ఎయిర్‌టెల్‌కు టాటా టెలీ అమ్మేసింది. ఆ తర్వాత నుంచి కంపెనీ ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్ మెరుగుపడుతోందని కేర్ పేర్కొంది. జూన్, 2019 తర్వాత నుంచి చూస్తే, ఇప్పటి వరకు రూ. 46,595.05 కోట్లను టీటీఎంఎల్, టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్‌ఎల్) లో టాటా సన్స్ ఇన్వెస్ట్ చేశారు. టాటా గ్రూప్ ఈ కంపెనీకి ప్రయారిటీ ఇస్తుండడంతో ఇన్వెస్టర్లలో ఈ షేరుకి డిమాండ్ పెరుగుతోంది.