ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 213 దేశాలకు విస్తరించిన మహమ్మారికి రోజూ వేలాది మంది బలవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో లక్షా ఆరు వేల మందికి కరోనా సోకింది. అమెరికా, రష్యాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్ దేశాల్లోనూ దారుణ పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడ్డవారి సంఖ్య 51 లక్షల 93 వేలు దాటింది. కరోనా దెబ్బకు 3 లక్షల 34 వేల మందికి పైగా చనిపోయారు. ఇప్పటివరకు కరోనా నుంచి 20 లక్షల 80 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అమెరికాలో నిన్న మళ్లీ కేసులు పెరిగాయి. ఒక్క రోజే 28 వేలకు పైగా కేసులు రావడంతో యూఎస్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16 లక్షల 20 వేలు దాటింది. కరోనాతో నిన్న 1418 మంది చనిపోవడంతో… మొత్తం మరణాలు 96 వేల 354కు పెరిగింది. రష్యాలో గత 24 గంటల్లో 8 వేల 849 కేసులు వచ్చాయి. దీంతో రష్యాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 17 వేలు దాటింది. బ్రెజిల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. నిన్న ఒక్కరోజే 17 వేల కేసులు నమోదు కాగా.. 1188 మంది చనిపోయారు. బ్రిటన్‌లో మరో 338 మంది కరోనాకు బలయ్యారు.
ఆఫ్రికాలో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో తాజాగా రెండు రోజుల పసికందు కరోనాకు బలయింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ శిశువులో.. శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆ శిశువు చనిపోయింది. చనిపోయిన తర్వాత పరీక్ష చేయగా కరోనా ఉన్నట్లు తేలింది. చైనాలో మొదలైన కరోనా.. తన రూపు మార్చుకుని మళ్లీ మరోసారి తన పంజా విసిరింది. జిలిన్ ప్రావిన్స్‌లోని జిలిన్, షులాన్ పట్టణాల్లో కరోనా కేసులు పెరిగిపోవడంతో వుహాన్ తరహా లాక్‌డౌన్‌ను విధించారు. ఈ పట్టణాల్లో వ్యాపించిన వైరస్ జన్యు మార్పులు చేసుకున్న కరోనావైరస్‌గా భావిస్తున్నారు. ఈ మార్పుల వల్ల వుహాన్ వైరస్ కంటే… ఈ వైరస్ ప్రమాదకరంగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు. వుహాన్ నగరంలో కొవిడ్ లక్షణాలు కనిపించనప్పటికీ పాజిటివ్‌గా తేలుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చైనా వ్యాప్తంగా 31 మందికి సిమ్టమ్స్ లేకుండానే వైరస్ వచ్చింది. అందులో 28 కేసులు వుహాన్‌లోనే రావడం గమనార్హం.
For More News..