‘నీలోఫర్’లో నెల రోజుల బాబు కిడ్నాప్

‘నీలోఫర్’లో నెల రోజుల బాబు కిడ్నాప్

మెహిదీపట్నం, వెలుగు: సిటీలోని నీలోఫర్ ఆసుపత్రిలో నెల రోజుల బాబు కిడ్నాప్​కు గురయ్యాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు నెల రోజుల కింద బాబు పుట్టాడు. కొన్నిరోజులకు జాండీస్ ​అటాక్ ​అవ్వడంతో వైద్యం కోసం సిటీలోని నీలోఫర్ హాస్పిటల్ లో అడ్మిట్​చేశారు. చికిత్స అనంతరం డాక్టర్లు శనివారం సాయంత్రం డిశ్చార్జ్​ చేశారు. హసీనా బేగం తన తల్లితో కలిసి బాబును బయటకు తీసుకెళ్తుండగా, ఓ గుర్తుతెలియని మహిళ వారివద్దకు వచ్చింది. తాను ఆస్పత్రి సిబ్బందిని అని నమ్మబలికింది. వెళ్లి మందులు తెచ్చుకోండి అప్పటివరకు బాబును చూస్తానని చెప్పింది.

ఇద్దరూ వెళ్లి మందులు తెచ్చుకునే గ్యాప్​లో ఆ మహిళ బాబుతో జారుకుంది. ఎంత వెతికినా కనిపించకపోవడంతో చివరికి నాంపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సంజయ్​తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా, శనివారం అర్ధరాత్రి 11 గంటల టైంలో ఏపీలోని కర్నూల్​ టోల్​గేట్​ వద్ద బస్సులో బాబును గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో మహిళను అరెస్ట్​చేసి, బాబును సిటీకి తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. కిడ్నాప్​చేసిన మహిళకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు తెలిపారు.