ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
సెప్టెంబర్ 14న ఆమెపై గ్యాంగ్ రేప్
యువతిని చిత్రహింసలకు గురిచేసిన సైకోలు
నిందితులు నలుగురు అరెస్టు
హత్రాస్ (యూపీ)/న్యూఢిల్లీ: మరో ‘నిర్భయ’ కన్నుమూసింది. గ్యాంగ్ రేప్ కు గురై.. చిత్రహింసలు భరించి.. నాలుక తెగిపోయి.. మెడ దగ్గర ఎముకలు విరిగి.. చేతులు, కాళ్లు చచ్చుబడి.. 15 రోజులపాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన దళిత యువతి తన పోరాటాన్ని చాలించింది. ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయింది. క్రూరంగా గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులు అగ్ర కులానికి చెందిన వాళ్లని, ప్రస్తుతం జైలులో ఉన్నారని పోలీసులు చెప్పారు. మరోవైపు బాధిత యువతి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సాయం చేస్తామని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్ సీడబ్ల్యూ) చెప్పింది.
ఆస్పత్రి బయట ఆందోళన
యువతి మృతి గురించి తెలియగానే ఆస్పత్రి బయట, విజయ్ చౌక్ , హత్రాస్ లో ఆందోళనలు జరిగాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేశాయి. కేసు దర్యాప్తు విషయంలో పోలీసుల తీరుకు నిరసనగా యువతి కుటుంబ సభ్యులు ఆస్పత్రి బయట బైఠాయించారు. ఆందోళనల్లో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్… నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దళితులంతా రోడ్లపైకి వచ్చి ప్రొటెస్టులు చేయాలని పిలుపునిచ్చారు.
గొంతు కోయాలని ప్రయత్నించారు..
బాధిత యువతి మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. సందీప్, రాము, లవ్ కుశ్, రవి కలిసి తనను రేప్ చేశారని చెప్పింది. వాళ్ల మాట వినకుండా ప్రతిఘటించడంతో గొంతు కోసేందుకు ప్రయత్నించారని, ఈ సమయంలో తన నాలుక తెగిందని తెలిపింది. సెప్టెంబర్ 15న అలీగఢ్ లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది. అయితే అక్కడ రికవర్ కాకపోవడం, పరిస్థితి విషమించడంతో సోమవారం ఢిల్లీకి తరలించారు. ఈ క్రమంలో మంగళవారం చనిపోయింది. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయని, చేతులకు పక్షవాతం వచ్చిందని డాక్టర్లు చెప్పారు.
అసలేం జరిగింది..
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాకు చెందిన యువతి.. సెప్టెంబర్ 14న తన తల్లి, బ్రదర్‌తో కలిసి గడ్డి కోసుకురావడానికి వెళ్లింది. ‘‘మా అన్న ముందే గడ్డి మోపు ఎత్తుకుని ఇంటికి వెళ్లాడు. అమ్మకు కొద్ది దూరంలో అక్క గడ్డి కోస్తోంది. ఇంతలో నలుగురు వెనుక నుంచి వచ్చి.. మా అక్క దుపట్టాను ఆమె మెడకు బిగించి లాక్కెళ్లారు” అని బాధితురాలి తమ్ముడు చెప్పాడు. ‘‘అక్క కనిపించకపోవడంతో అమ్మ వెతుక్కుంటూ వెళ్లింది. కొద్ది దూరంలో బట్టలు లేకుండా, రక్తం కారుతూ, తీవ్ర గాయాలై పడి ఉండటాన్ని గమనించింది. బట్టలు కప్పింది. తర్వాత నేరుగా అందరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. ఆమె మెడలో మూడు ఎముకలు విరిగిపోయాయి” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించలేదని, నాలుగు రోజుల తర్వాత చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
హత్రాస్ బాధితురాలి మరణం సమాజానికి, దేశానికి, ప్రభుత్వాలకు సిగ్గుచేటు. ఎంతో మంది కుమార్తెలు లైంగిక వేధింపులకు గుర వుతున్నారు. ఇది చాలా విచారకరం. మేం వారిని రక్షించలేకపోతున్నాం. దోషులను వీలైనంత త్వరగా ఉరి తీయాలి.
– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
బాధిత యువతి చనిపోవడం బాధించింది. ఆమె కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి. దోషులను కఠినంగా శిక్షించాలి.
– బీఎస్పీ చీఫ్ మాయావతి
For More News..