మెదక్ జిల్లాలో ఒకరు హత్య,ఇద్దరు సూసైడ్

మెదక్ జిల్లాలో ఒకరు హత్య,ఇద్దరు సూసైడ్

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ గ్రామ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎస్ఐ సుభాష్​కథనం ప్రకారం.. శనివారం రాత్రి  గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. 

జిన్నారం సీఐ నయీమొద్దీన్ జాగిలాలతో ఎంక్వయిరీ చేశారు. మృతురాలి వయసు 25 నుంచి -35 సంవత్సరాలు ఉంటుందని చెవులకు మాటీలు, కాళ్లకు కడియాలు ఒంటిపై ఆకుపచ్చ చీర ఉందన్నారు. ఆచూకీ తెలిసినవారు హత్నూర పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

గడ్డి మందు తాగి ఒకరు..

శివ్వంపేట : గడ్డి మందు తాగి ఒకరు మృతి చెందిన ఘటన శివ్వంపేట పీఎస్​పరిధిలో జరిగింది. ఎస్ఐ కథనం ప్రకారం.. తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ మోతీలాల్  (35)  వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి మద్యానికి బానిసై అప్పుల పాలయ్యాడు. ఇంట్లో సమస్యలు ఎక్కువ కావడంతో పొలం దగ్గరికి వెళ్లి  గడ్డి మందు తాగాడు. 

గమనించిన అతడి భార్య చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా  డాక్టర్లు చనిపోయినట్లు నిర్ధారించారు. ఆమె ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు.

పురుగుల మందు తాగి..

సిద్దిపేట రూరల్ : పురుగుల మందు తాగి ఒకరు సూసైడ్​చేసుకున్న ఘటన సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్​పరిధిలో జరిగింది. సీఐ విద్యాసాగర్ కథనం ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పొడిశెట్టి సంజీవ్ (35) పెయింటర్ గా పనిచేస్తున్నాడు. గత నెల 29 నుంచి కనిపించకపోవడంతో అతడి తల్లి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆదివారం కిష్ట సాగర్ గ్రామ శివారులో ఉన్న ఒడిసెలకుంట దగ్గర సంజీవ డెడ్​బాడీ కనిపించింది. తన కొడుకు మృతికి అతడి భార్య విడాకులు ఇవ్వడమే కారణమని తల్లి చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

గుర్తు తెలియని వ్యక్తి..

గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ శివారులో మిలాన్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని మగ వ్యక్తి  గాయాలతో పడి ఉన్నాడన్న సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు. 

డెడ్​బాడీని హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచామని, వయస్సు 25 నుంచి 30 మధ్యలో ఉంటుందన్నారు. మృతుడి ఎడమ వైపు ఛాతిపై అంజలి అనే పచ్చబొట్టు ఉందని, ఆచూకీ తెలిసినవారు సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్​ను సంప్రదించాలని సీఐ విద్యాసాగర్ తెలిపారు.