దేశంలో అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో సమ ప్రాతినిధ్యం లభించాలన్న లక్ష్యంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రిజర్వేషన్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరక ముందే రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉన్న రిజర్వేషన్లను ప్రైవేటు రంగంలోనూ పెట్టాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో మొత్తంగా ఎత్తేయాలని చూడడం దారుణం. ఇప్పటికే నీట్ ద్వారా మెడికల్ అడ్మిషన్లలో, నల్సార్ లా వర్సిటీ, సెంట్రల్ వర్సిటీలు, లక్నోలోని అంబేద్కర్ యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు సరిగా అమలు కావడం లేదు. ఇప్పుడు ఐఐటీ–ఢిల్లీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు నేతృత్వంలోని కమిటీ దేశంలోని ఐఐటీల్లో ప్రొఫెసర్ల నియామకాల్లో రిజర్వేషన్ల ఎత్తివేతకు సిఫార్సు చేయడం సరికాదు. ఇదే సమయంలో దేశంలో కుల వివక్ష అన్నది పూర్తిగా తొలగిపోయి.. అందరికీ సమాన అవకాశాలు రావాలన్నా , రిజర్వేషన్లు ఎత్తేయాలన్నా.. దేశంలో ‘వన్ నేషన్ – వన్ క్యాస్ట్’ విధానం రావాలి.
ప్రజాస్వామ్యవ్యవస్థలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, న్యాయ.. ఇలా అన్ని రంగాల్లోనూ జనాభా రేషియో ప్రకారం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కోటా కల్పించారు. కానీ ఉన్నత న్యాయ స్థానాలైన హైకోర్టు, సుప్రీంకోర్టు- జడ్జీల నియామకాల్లో, రాజకీయ రంగంలో రాజ్యసభ, కౌన్సిల్, నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు లేకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఇక స్వాతంత్ర్యం వచ్చిన 36 ఏండ్ల తర్వాత బీసీలకు 1993లో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. జాతీయ స్థాయిలో బీసీల జనాభా 56 శాతం ఉంటే విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు పెట్టారు. ఇక చట్టసభల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టడం లేదు. పెట్టడానికి కనీసం ముందుకు రావడం లేదు. కానీ రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్ లేని అంశమైన అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో.. రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టడానికి మనసు పెట్టడం లేదు.
ఉన్న రిజర్వేషన్ల అమలులోనూ నిర్లక్ష్యమే
మండల్ కమిషన్ సిఫార్సుల అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయడం మొదలైంది. కానీ 1993 తర్వాత కొన్నాళ్లకే లక్షల పోస్టుల భర్తీలో అలసత్వం ప్రదర్శించారు. రిజర్వేషన్లు పెట్టినా బడుగు, బలహీన వర్గాలకు ఉపయోగం లేకుండా చేశారు. మండల్ సిఫార్సులు అమల్లోకి వచ్చిన ఈ 37 ఏండ్లలో వాస్తవానికి 27 శాతం ఓబీసీ కోటా ఉన్నప్పటికీ ఎప్పుడూ పూర్తి స్థాయిలో న్యాయం జరిగిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నేటికీ ఓబీసీలు 14% దాటడం లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 74 ఏండ్లుగా అమలు చేస్తున్నా.. వేలాదిగా బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా మొత్తం ఉద్యోగాల్లో ఇప్పటికీ 12 శాతం దాటడంలేదు. అలాగే ఎస్టీలకు 7.5% కోటా ఉన్నా జాతీయ స్థాయిలో 5 శాతం దాటడం లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో 1657 ఐఏఎస్, 1420 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తం ఖాళీలు ఉన్నా సరే క్వాలిటీ తగ్గుతుందనే సాకు చూపుతూ ఏటా ఐఏఎస్‌లో 100లోపు, ఐపీఎస్‌లో 120 లోపు ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, రక్షణ రంగంలో, బ్యాంకింగ్ సెక్టార్‌లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. దీని మూలంగా ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్ కోటా భర్తీ కాకుండా అన్యాయం జరుగుతోంది.
రిజర్వేషన్ సమానత్వపు హక్కు..
రిజర్వేషన్లు భిక్షం కాదు. రాజ్యాంగబద్ధమైన హక్కు. అందరూ సమానమే అన్న భావనతో బతకాలన్న లక్ష్యంతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఇది. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రతిసారి అగ్రకులాలు మెరిట్ దెబ్బతింటుందని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు. ఈ కులాల వృత్తులను కించపరుస్తూ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. కానీ అటువంటి భేదాలు లేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమానమైన హక్కులు, ప్రాతినిధ్యం వచ్చేందుకే విద్య, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నది. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతుల్లో అంతరాలను తొలగించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాజ్యాంగంలోని ప్రాథమిక, ఆదేశిక సూత్రాల్లో స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కుల వివక్షతో చూడకుండా తోటివారిగా అందరినీ సమానంగా చూసే రోజు రావాలన్న ప్రగతిశీల భావాలు ఉన్న వాళ్లు రిజర్వేషన్లను ఆహ్వానిస్తారు.
మెరిట్ లేదన్న ఆలోచన అర్థం లేనిది
ఎస్సీ, ఎస్టీ, బీసీలు మెరిట్ సాధించి పోటీ పడలేక రిజర్వేషన్లు కోరుకుంటున్నారన్న ధోరణి ఎవరు ప్రదర్శించినా అది ఆయా వర్గాలను అవమానించడమే అవుతుంది. ప్రతిభ అనేది కులం ఆధారంగా వచ్చేది కాదని గుర్తించాలి. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ఏ వర్గాలకు చెందిన వ్యక్తన్నది అందరూ తెలుసుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్ సహా జాతీయ, అంతర్జాతీయ సంస్థలను నడిపే కీలక పాత్రల్లో అణగారిన వర్గాల బిడ్డలు ఎందరో ఉన్నారని గుర్తించాలి. ఇవన్నీ ప్రతిభ, సమర్థత లేకుండా సాధ్యం కాదు. కానీ నేటికీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయడానికి గల కారణం.. కులం ఆధారంగా వివక్ష కొనసాగుతూ ఉండడమే. అలుసు దొరికితే అణగారిన వర్గాలను ఎప్పటికీ తమ కిందే తొక్కి పెట్టాలన్న ఫ్యూడల్ భావజాలాలు నశించనంత వరకూ పేద బడుగు వర్గాలకు సమాన అవకాశాలు అన్న మాట అందని ద్రాక్షే. అట్టడుగున ఉన్న వాళ్లు ఉన్నత స్థానాలకు చేరే వరకు ఈ వివక్ష తొలగిపోదు. మనిషి పెరిగే పరిస్థితులు, అనుభవాల ఆధారంగానే ప్రతిభా స్థాయిల్లో మార్పు కనిపిస్తుంది. దేశానికి వెన్నెముకగా చెప్పే రైతును నడిపించే వ్యవసాయ పనిముట్లు, దేవాలయాల్లో అందరూ మొక్కే దేవతామూర్తులు, శిల్పాలు, రారాజుల నుంచి నిరు పేదల వరకు కోరుకునే బంగారు ఆభరణాలు… ఇలా ఒకటేంటి.. మనం నిద్ర లేచిన దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువు కూడా ఆ వెనుకబడిన వర్గాలుగా చెప్పే వారి నైపుణ్యానికి ప్రతీకలే. 400 ఏండ్లకు పూర్వమే అగ్గిపెట్టెలో పట్టుచీరను బ్రిటీష్ రాణికి పంపిన నేత కార్మికుల నైపుణ్యంలో మెరిట్ లేదా? సాధనతో ఎటువంటి విషయాన్నైనా అవపోసన పట్టొచ్చని పాలకులు, రిజర్వేషన్లను వ్యతిరేకించే మేధావులు తెలుసుకోవాలి. కానీ అవకాశాలు పొందడం కోసం అణగారిన వర్గాలకు ఉన్న గేట్ వే రిజర్వేషన్లు. వందల ఏండ్లుగా జాతి నిర్మాణంలో తమ పాత్ర పోషిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే మెరిట్ దెబ్బతింటుందని, పాలన సామర్థ్యం తగ్గిపోతుందని, కులతత్వం పెరుగుతుందని, రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని ఇలా రకరకాల వాదనలు చేయడం ఎంత వరకు సబబు? జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకూ, అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు దక్కాల్సిందే.
రాజ్యాంగ సవరణ చేయాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికే రిజర్వేషన్లు సరిగా అమలుకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఐఐటీల్లో ప్రొఫెసర్ల నియామకాల రిజర్వేషన్ల తొలగింపుపై వచ్చిన సిఫార్సులను కేంద్రం ఎటువంటి షరతులూ లేకుండా తిరస్కరించాలి. ఈ ఉద్యోగ నియామకాల్లో ప్రొఫెసర్లకు ఇతర కులాలతో సమానంగా విద్యార్హతలు, పీహెచ్‌డీ, కనీస మార్కులు మెరిట్ ప్రాతిపాదికనే సెలక్షన్ కొనసాగిస్తే అసలు కోటా తొలగించాలన్న ఆలోచన చేయాల్సిన అవసరమేంటి?
వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు లాగా కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ – వన్ క్యాస్ట్ అన్న నినాదాన్ని ఇచ్చి, కులాంతర వివాహాలను నిర్బంధం చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు అసలు రిజర్వేషన్ల అవసరమే ఉండదు. కుల వివక్ష అన్నది పూర్తిగా రూపుమాపి రిజర్వేషన్లు ఎత్తేస్తే అర్థవంతంగా ఉంటుంది. -ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు.
వన్ నేషన్.. వన్ క్యాస్ట్ విధానం రావాలె
- ఆంధ్రప్రదేశ్
- December 23, 2020
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు