- 39 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
- సభ్యులుగా లోక్సభ నుంచి27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది
న్యూఢిల్లీ: వన్ నేషన్, వన్ ఎలక్షన్కు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ స్పీకర్ ఓంబిర్లా శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపారు. ఈ కమిటీలో మొత్తం 39 మంది సభ్యులు ఉండనున్నారు. అన్ని రాష్ట్రాలతో ముడిపడి ఉన్న జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులు కావడంతో కమిటీలోని సభ్యుల సంఖ్యను 31 నుంచి 39కు కేంద్రం పెంచింది. అపోజిషన్ పార్టీల డిమాండ్ మేరకు అన్ని పార్టీల సభ్యులు.. జమిలి ఎన్నికల బిల్లులపై జరిగే విస్తృత చర్చలో పాల్గొనేలా కేంద్రం నిర్ణయించింది.
ఈ కమిటీకి బీజేపీ ఎంపీ, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి పీపీ చౌధరి చైర్మన్గా ఉంటారు. మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, మనీశ్ తివారిలతో పాటు ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, బన్సూరి స్వరాజ్, సంబిత్ పాత్రాతో పాటు మరికొంత మంది సభ్యులుగా ఉండనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై జేపీసీ సభ్యులు చర్చిస్తారు.
ఎన్డీయే కూటమి నుంచి 22 మంది
జేపీసీలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. పార్టీల పరంగా చూసుకుంటే.. 39 మందిలో 16 మంది బీజేపీ నుంచి ఐదుగురు కాంగ్రెస్ నుంచి, సమాజ్వాది పార్టీ, టీఎంసీ, డీఎంకే నుంచి ఇద్దరు చొప్పున కమిటీలో ఉంటారు. అదేవిధంగా, శివసేన, టీడీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేఎస్పీ (ఆర్వీ), జేఎస్పీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), సీపీఐ (ఎం), ఆప్, బీజేడీ, వైఎస్ఆర్ సీపీ నుంచి ఒక్కొక్కరు జేపీసీ ఉంటారు.
ఎన్డీయే కూటమి నుంచి 22 మంది ఉంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి 10 మంది ఉన్నారు. కాగా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చేసిన తీర్మానం ప్రకారం.. కమిటీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్ చివరి వారం మొదటి రోజులోగా లోక్సభకు సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే.. కమిటీ గడువును కూడా పెంచే అవకాశాలుంటాయి.
దేశాభివృద్ధికి జమిలి ఎంతో కీలకం: కిరణ్ రిజిజు
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లులు దేశాభివృద్ధికి ఎంతో కీలకమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అపోజిషన్ పార్టీల డిమాండ్ మేరకు రెండు బిల్లులను జేపీసీకి పంపినట్లు తెలిపారు.